ఓటమికి సిద్ధమై పోరాడుతున్న జగన్, చంద్ర బాబు!

ChandraBabu Dangeorus plan On YS Jagan

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంలో గైకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక పోరాటం సాగుతుంటే మరో ఉద్యమం రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలతో కలసి ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి కూడా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. నూరు ఆరైనా ఆరు నూరైనా సాధించ లేని లక్ష్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెండు పోరాటాలు నడుస్తున్నాయి.

వాస్తవం చెప్పాలంటే రాజధాని తరలింపు ఖరారని తేలి పోయినా ఉద్యమం ఆగడం లేదు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అది ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం చట్ట సభలో ప్రకటించినా దానికోసం తుదకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాకు లాడు తున్నారు. రాజధాని ఉద్యమం ఫలితంగా రాష్ట్రం నేడు అట్టుడికి నట్లుంది. ధర్నాలు నిరసన ప్రదర్శనలు ఊరేగింపులు వెంబడే పోలీసుల లాఠీ ఛార్జీలు అందుపై ప్రతిపక్ష నేతల నిరసన ప్రకటనలు నిత్య కృత్యమయ్యాయి. అంతేకాదు. ఒకే రాజధాని మూడు రాజధానులు అంటూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు సభలు జరుగు తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం వాసనలు ఏమాత్రం లేకుండా చేసే సరికొత్త విధంగా చేపట్టారు. అందులో భాగమే రాజధాని మార్పు. .

రాజధాని మార్పుకు వైసిపి ప్రభుత్వం చేప్ఫే కారణాలు అనేకం వున్నాయి. కొత్త నగరం ( గ్రీన్ ఫీల్డ్) నిర్మించాలంటే భారీ ఎత్తున నిధులు వ్యయం చేయాలని ఈ పాటికే అభివృద్ధి చెందిన నగరమైతే తక్కువ వ్యయంతో సరిపోతుందని ఒక అంశమైతే పరిపాలన వికేంద్రీకృతం ద్వారా అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో విస్తరించ వచ్చని రెండవ అంశం. అయితే అమరావతిలో ఈ పాటికే వ్యయం చేసిన పదివేల కోట్ల రూపాయలు నిర్మించిన నిర్మాణంలో వున్న భవనాలతో పాటు రాజధాని రైతులకు ఇవ్వవలచివచ్చే నష్ట పరిహారం గురించి రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాధానంలేదు. ఇదంతా తడిసి మోపేడౌతుందనే వాదన ఉంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వభావం ఎరిగిన వారెవ్వరూ ఒక దఫా తీసుకున్న నిర్ణయం తిరిగి వెనక్కి తీసుకోడని అందరికీ తెలిసినా అమరావతి రైతులు వీరితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలు పట్టువీడకుండా పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా పట్టువీడని విక్రమార్కుడుగా వున్నారు.కాసింత కూడా పువరాలోచన లేదు. ఫలితంగా రాష్ట్రాభి వృద్ధి తిరోగమనం పట్టింది. పోనీ కేంద్రం అయినా జోక్యం చేసుకుంటుందా? అంటే అదీ గాలికీ పోయింది. కర్ర విరగకుండా పాము చావ కుండా ప్రకటన చేసింది. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే నని చెబుతూ 2015లోనే అమరావతి రాజధానిగా నోటిఫై చేయ బడిందని మాత్రం తేల్చింది. ఈ ప్రకటనపై ఎవరి భాష్యాలు వారు చెప్పుకుంటున్నా ముఖ్యమంత్రి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కన్పించడం లేదు. ఒక వేపు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు తరలించ కూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా బలాదూర్ అని ఆదేశాలు జారీ చేయించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో సాగు తున్న పోరాటాలు ఒక లెక్కా డొక్కా? ముఖ్యమంత్రి రోజు రోజుకూ పట్టుబిగించుతున్నారు.

మరో పోరాటం ప్రత్యేక హోదా సాధన. కేంద్ర ప్రభుత్వం అది ముగిసిన అధ్యాయమని 2017 లోనే స్పష్టం చేసి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. తుదకు చంద్రబాబు నాయుడు కూడా “ఊ” కొట్టారు. అదే మహద్భాభ్యమన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా వుండిన జగన్మోహన్ రెడ్డి తనకు 25 పార్లమెంటు స్థానాలు కట్టబెడితే ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రజలను నమ్మ బలికారు. 22 మంది యంపి లను గెలిపించారు కాని ఏమైంది? ప్రస్తుతం కేంద్రానికి లేఖలు రాయడంతో సరిపెట్టుకోవలసి వస్తోంది. ఇవన్నీ అటుంచి బిజెపి అధికార ప్రతినిధి నరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇంకా అడిగితే చంద్రబాబు నాయుడుకు ఎదురైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చవి చూడవలసి వస్తుందని చేసిన వ్యాఖ్య కేంద్రం దురహంకారానికి ప్రతీకగా వుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రత్యేక హోదా కేంద్రం వైఖరి అంశాలపై అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలు లాంటివియే ప్రస్తుతం టిడిపి నేతలు వైసిపి ప్రభుత్వం గురించి చేస్తున్నారు. అప్పుడూ ఇప్పడూ అందరికి తెలుసు. ప్రత్యేక హోదా సాధన సాధ్యం కాదని.

గమనార్హంమైన అంశమేమంటే అమరావతిలో రాజధానిని కొనసాగించడం సాధ్యం కాదని తెలిసీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు రైతులు పోరాటం సాగిస్తున్నట్లే ప్రత్యేక హోదా సాధన సాధ్యం కాదని తెలిసీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దానికోసం విఫల యత్నం చేస్తున్నారు

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013