“ఐటి” వార్- ఆదివారం స్వరం పెంచిన టిడిపి నేతలు

ఇటీవల ఐటి అధికారులు దేశంలో 40 కేంద్రాల్లో దాడులు సాగించి సోదాలు చేశారు. సాధారణంగా తరచూ ఐటి శాఖ ఈలాంటి దాడులు సాగించడం కద్దు. అయితే ఈ దఫా చంద్రబాబు నాయుడు వద్ద పియస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు ఇంటిలో మరి కొందరు టిడిపి నాయకుల ఇళ్లల్లో సోదాలు చేయడం కలకలం సృష్టించింది. అది కూడా శ్రీనివాస్ రావు ఇంటిలో అయిదు రోజులు సాగించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దాడులు పూర్తయిన తర్వాత ఐటి శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదీ అస్పష్టంగా వుంది. అందులో శ్రీనివాస్ రావు ప్రస్తావన తెచ్చారు. పరోక్షంగా చంద్రబాబు నాయుడు పేరు తీసుకురావడంతో వైసిపి నేతలకు చేతికి నోటికి నిండా పని లభించింది. మూకుమ్మడిగా దాడి సాగించారు. ఇందుకు మరో పూర్వరంగముంది.

అదే రోజు ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసుకు చెంది తెలంగాణ హైకోర్టులో సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ మీడియాలో వచ్చింది. ఆ అఫిడవిట్ ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కించ పర్చే విధంగా వుంది. దాని నుండి ప్రజాభిప్రాయం మళ్లించేందుకు ఐటి శాఖ అస్పష్టమైన రిపోర్టు వైసిపి నేతలకు చక్కగా ఉపయోగ పడింది. వైసిపి నేతల తీవ్రమైన దాడి ముందు ఆత్మరక్షణలో పడిన టిడిపి నేతలు కంగుతిన్నారు.వైసిపి నేతలు ముఖ్యమంత్రి పై సిబిఐ వేసిన అఫిడవిట్ ప్రజల దృష్టి నుండి మళ్లించడమే కాకుండా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడంలో విజయం సాధించారు. ఈ అంశంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు మూగనోము పెట్టడం పెద్ద మైనస్ గా మారింది.

అయితే శ్రీనివాస్ రావు ఇంటిలో పెద్దగా ఏమీ దొరక లేదని టిడిపి నేతలకు తెలుసు. కానీ వివరాలు తెలియ కుండా వుండి పోయారు. తుదకు కొన్ని మీడియా సంస్థలు శ్రీనివాస్ రావు ఇంటి సోదా అనంతరం చేసిన పంచనామా రిపోర్టు సంపాదించారు. ఆ తర్వాత గాని టిడిపి నేతలు తేరుకోలేదు. ఆదివారం టిడిపి నేతలు స్వరం పెంచి ఎదురు దాడికి దిగడంతో వైసిపి నేతలు తిరిగి కంగుతిన్నారు. శ్రీనివాస్ రావు ఇంట్లో రెండు వేల కోట్లు పట్టుబడ్డాయని తాము చెప్ప లేదని రెండు వేల కోట్ల లావాదేవీలకు చెందిన పత్రాలు సీజ్ చేశారని చెప్పినట్లు వివరణ ఇచ్చుకున్నారు. ఆ విధంగా సీజ్ చేసినా పంచనామా రిపోర్టులో పొందు పర్చాలి. అది జరగలేదు కాబట్టి టిడిపి నేతలు లీగల్ గా వెళ్తామని ప్రకటనలు ఇవ్వ గానే ఒక టివి సంస్థ అప్పుడే క్షమాపణలు చెప్పిందిఅయితే ఈ పరస్పర ఆరోపణలు ఇంతటితో ఆగే పరిస్థితి కన్పించడం లేదు. ఒక టిడిపి నేత ముఖ్యమంత్రి పై తీవ్ర మైన వ్యాఖ్యానాలు చేశారు. ఇక మున్ముందు మరింత ప్రకోపించే అవకాశముంది.

దురదృష్టమేమంటే టిడిపి వైసిపి రాజకీయ వైషమ్యాల మధ్య మూడు రాజధానుల ప్రతిపాదనల మధ్య ప్రజల నిత్య జీవిత సమస్యలు మరుగున పడుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో వున్న ప్రభుత్వం ఆభివ్రుద్ది కార్యక్రమాలు అమలు చేయలేక ప్రతిపక్షాల దృష్టి మరల్చేందుకు మూడు రాజధానుల ప్రతి పాదనలు ఐటి శాఖల దాడులు తెర మీదకు తెస్తోంది.