ఏపీ అధికారుల వింత పోకడ.. బాధితుల మీదే కేసులా !

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన ఎంత తీవ్రమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  12 మంది మృత్యువాత పడగా అనేకమంది ఆసుపత్రి పాలయ్యారు, అక్కడి ప్రజల సాధారణ జీవనం చిన్నాభిన్నమైంది. సాధారణంగా అయితే ఇలాంటి పరిణమాలు భారీ ఆందోళనలకు దారి తీస్తాయి. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని అవేవీ జరగలేదు.  సీఎం జగన్ భారీ మొత్తంలో పరిహారం ప్రకటించడంతో బాధితులు కూడా కాస్త శాంతించారు.  మొదట్లో బాధితులు కంపెనీ ముందు ఆందోళనకు దిగినా నేతలు సర్దిచెప్పడంతో వెనక్కితగ్గారు.  కానీ అధికారుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 
 
మృతదేహాలతో కంపెనీ ముందు నిరసన చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  ఇందులో అపెడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా ఉన్నాయి.  సుమారు 50 మందిపై ఈ కేసులు పెట్టారు.  వాటిలో దుర్ఘటనలో మరణించిన చినారి గ్రీష్మ యొక్క తల్లి లత పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.  ఇక్కడ బాధితులు చేసిందల్లా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోమని, ఆ కంపెనీని అక్కడి నుండి తరలించమని డిమాండ్ చేయడమే.  
 
దానికే వారి మీద కేసులు పెట్టి అర్థరాత్రి వేళ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి, రిమాండ్ విధించాలని అధికారులు కోరారు.  కానీ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.  కనీసం యాజమాన్యం నుండి నామమాత్రపు వివరణ కూడా రాలేదు.  ఈ తంతు మొత్తం చూస్తున్న విశాఖ ప్రజలు ఇదెక్కడి న్యాయం, దుర్ఘటనకు కారణమైన వారిని వదిలేసి బాధితుల మీద చర్యలు తీసుకోవడం అమానుషం అంటూ మండిపడుతున్నారు.