ఏపీలో నమోదైన తొలి కరోనా కేసు.. ఆందోళనలో నెల్లూరు వాసులు

ఆంధ్రప్రదేశ్‌‌లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్‌గా రావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అలజడి మొదలైంది. యువకుడు ఈ మధ్యే ఇటలీ నుంచి నెల్లూరు వచ్చినట్లు తేలింది. పాజిటివ్ రావడంతో అలెర్ట్ అయిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు యువకుడు నివసించే ప్రాంతం చిన్న బజార్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ ఏరియాను శుభ్రం చేసేందేకు శానిటరీ డిపార్ట్‌మెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. దీంతో నెల్లూరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ప్రస్తుతం యువకుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటలీ నుంచి వచ్చిన తర్వాత ఆ యువకుడు ఎవరెవరిని, ఎంత మందిని కలిశాడు అనే సమాచారం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు బైట పడటంతో అతన్ని కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే కరోనా కేసు రాష్ట్రంలో నమోదైన నేపథ్యంలో రంగనాథస్వామి రథోత్సవాన్ని ఆపేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే రథోత్సవం ఆపడం మంచిది కాదని, తూర్పుమాడ వీధులలోనైనా ఈ ఉత్సవాన్ని జరపాలని పండితులు నిర్ణయించారు.