ఎసై పై తిరగబడిన మాజీ మంత్రి

చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్ళకుండా అడ్డుకున్నారన్న కోపంతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఓ మహిళా ఎసై పై తిరగబడ్డారు. చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు భూమా తన మద్దతుదారులతో గుంటూరుకు  చేరుకున్నారు. ఉదయం ఓ హోటల్లో నుండి బయటకు వచ్చే సమయంలో పోలీసులు భూమాను అడ్డుకున్నారు.

భూమాను హోటల్లోనే అడ్డుకున్న పోలీసులు బయటకు వెళ్ళేందుకు లేదని చెప్పటంతో మాజీ మంత్రికి ఒళ్ళు మండిపోయింది. పోలీసు అధికారులతో పాటు అక్కడే ఉన్న ఓ మహిళా ఎసై మీద తిరగబడ్డారు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటూ బెదిరించారు.

చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు లేదని టిడిపి నేతలను హౌస్ అరెస్టు చేయమని తమకు ఆదేశాలున్నాయని చెప్పినా అఖిల లెక్కచేయలేదు. తనను ఆపే హక్కు ఎవరికీ లేదంటూ నేటికొచ్చినట్లు పోలీసులను తిట్టారు. అయినా పోలీసులు వెనక్కు తగ్గకపోవటంతో అఖిల వాళ్ళతో వాగ్వాదానికి దిగి వారిని నెట్టుకుంటూ వెళ్ళేందుకు ప్రయత్నించారు. దాంతో అధికారులు ముందు మహిళా పోలీసులను పెట్టి మద్దతుదారులను అడ్డుకున్నారు.

ఎంత వాదించినా పోలీసులు కూడా వెనక్కు తగ్గకపోవటంతో చేసేది లేక హోటల్లోని తన గదిలోకి వెళ్ళిపోయారు అఖిల. తనను హౌస్ అరెస్టు చేయగానే ప్రజాస్వామ్యం గురించి నిబంధనల గురించి మాట్లాడిన ఇదే అఖిల కర్నూలు జిల్లాలోని వైసిపి నేతలను ఒకపుడు చాలా సార్లే హౌస్ అరెస్టులు చేయించిన విషయం మరచిపోయినట్లున్నారు.