ఎపిలో ఎన్నికల హోరు… జగన్ ప్రభుత్వానికి తొలి పరీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో జగన్ ప్రభుత్వం తొలి పరీక్షను ఎదుర్కోనుంది. ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు, రాజధాని తరలింపుపై చెలరేగిన వివాదాలకు ఈ ఎన్నికల ఫలితాలతో సమాధానం చెప్పాలని సమాయత్తమవుతోంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందు నుండే పై స్థాయి నేతల నుండి కింది స్థాయి కార్యకర్తల వరకు అందరినీ సిద్దం చేస్తూ వస్తోన్న అధికార పక్షం ఇప్పుడు అధికార గణాలకు దిశానిర్దేశం చేస్తోంది.

రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పు, వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని, హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అన్నారు.

పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతోనే ఆర్డినెన్స్‌ తెచ్చామని పదే పదే చేప్తారు. ఇదే మన నినాదంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార జోరు పెంచారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతూ, లేదా ఎన్నికల తర్వాత అయినా ఆ విషయం నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తామని, మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుందని ఆర్డినెన్స్‌లోని అంశాలను సీఎం జగన్ గుర్తు చేయడం చూస్తే అవినీతి పట్ల తాము మాటలు చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నామన్న సందేశాన్ని బలంగా ప్రజల్లోకి పంపారు.

మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి అని జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ వాలెంటీర్ నుండి, పోలీసు మిత్రలు, గ్రామాల్లోని మహిళా పోలీసులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేశారు. ఈ స్థాయిలో జగన్ వ్యూహాలు చూస్తుంటే.. అధికార వైసీపీ విజయ దుంధుబి మోగించడం ఖాయమన్నది సర్వత్రా వినవస్తోంది.

అదే సమయంలో టీడీపీకి కూడా ఈ ఎన్నికలు ఎంతో కీలకం.. సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయానికి ఎంతో కొంత ఊరట పొందాలన్నా పార్టీ శ్రేణులు తిరిగి పునరుజ్జీవం పొందాలన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానాలు చాలా కీలకం. అందుకే పాలక ప్రభుత్వ దూకుడుకి చెక్ పెట్టాలని విజృంభించాలని స్థానిక పోరుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మరి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎదుర్కొంటోన్న ఈ పరీక్షలో జగన్ ప్రభుత్వం విజయం సాధిస్తుందా? లేక ప్రతిపక్షం నిలదొక్కుకుంటుందా అన్నది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.