ఇసుక మాఫియా కనిపిస్తే…

ఎట్టి పరిస్ధితుల్లోను ఇసుక మాఫియా కనిపించకూడదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆదేశాలిచ్చారు. ఇసుక సరఫరాపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుకమాఫియా అన్నదే కనిపించకూడదన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన ఇసుక సరఫరాకు ప్రస్తుత ప్రభుత్వానికి తేడా స్పష్టంగా తెలియాలంటూ జగన్ అందరినీ ఆదేశించారు.

ఇసుక సరఫరాకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకన్నా ఎక్కువకు సరఫరా చేసేందుకు లేదన్నారు. నిర్ణయించిన ధరలకన్నా తక్కువకు సరఫరా చేయటానికి ఎవరు ముందుకొచ్చినా వారికి బాధత్య అప్పగించాలన్నారు. రాష్ట్రంలోని అన్నీ ఇసుక రీచులను ఓపెన్ చేయాలని, సరఫరా మొదలుపెట్టాలన్నారు.

వర్షాలు, వరదలు తగ్గటంతో ఇసుక రీచుల నుండి తవ్వకాలు కూడా రెడీ అయ్యాయి. దాంతో వినియోగదారులకు ఇసుకను వెంటనే  అందించే బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్లకు అప్పగించాలని జగన్ చెప్పారు. ప్రతి జిల్లాలోని నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బిసిలకు చెందిన యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా అవసరమైన వాహనాలను సమకూర్చి ఇసుక సరఫరా బాధ్యత వాళ్ళకే అప్పగించాలని చెప్పటం బ్రహ్మాండంగా ఉంది.

ఇసుక సరఫరా విషయంలోను, రీచులను సక్రమంగా నిర్వహించే విషయంలోను అధికారులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు జగన్ స్పష్టంగా చెప్పారు. కాబట్టి జిల్లాల్లోని నిరుద్యోగయువతకు ఉపాధి చూపినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నతాధికారులదే అని చెప్పటంతో యంత్రాంగం జాగ్రత్తగా ఉంటుందనటంలో సందేహం లేదు.