ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేటి నుండి ప్రజలకు రేషన్ నేరుగా ఇంటికే పంపిస్తామని చెప్పారు.. అయితే చివరి నిమిషంలో చేతులెత్తేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 19 కరోనా కేసులు నమోదవ్వడంతో.. ఉచిత రేషన్‌ను వారికి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అయితే అది ఆచరణలో సాధ్యం కాలేదు. ఆదివారం ఉదయం నుండి రేషన్ షాపుల ముందు ఎక్కడ చూసినా జనం బారులు తీరి ఉన్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చున్నారు. అలాగే బియ్యం, చక్కెర వంటి వాటితో పాటు మరి కొన్ని ఆహార పదార్ధాలు కూడా ఇస్తాం అని చెప్పినా అవన్నీ ప్రస్తుతం అందుబాటులో లేవు.

పైగా క్యూ లైన్లలో నిల్చున్న వారు ఇలా చేస్తే కరోనా రాదా..? ఇంటికే వచ్చి ఇస్తామన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు..? ఇప్పుడొచ్చి ఇవ్వమను అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వాలెంటీర్ల ద్వారా ఇస్తామన్న నిర్ణయాన్ని సడెన్ గా ఎందుకు మార్చినట్లు.. అది కూడా కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం పెద్ద తప్పే చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. కరోనా కేసులు మరింతగా పెరిగితే అది ఖచ్చితంగా ప్రభుత్వ తప్పిదమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.