ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు ఆయనపై కత్తి గట్టాయి. ఇంత అనతికాలంలోనే బహుశా ఏ రాష్ట్రంలో ఎప్పుడూ ఏ నేతకు చేదు అనుభవం ఎదురై వుండదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర మైన విమర్శలు చేస్తున్నారు. వామపక్షాలు కూడా తక్కువ తినలేదు. వీరంతా చేస్తున్న విమర్శలకు ఇంత వరకు నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరు విప్పలేదు. మంత్రులు పార్టీ నేతల చేతనే ప్రతి విమర్శలు చేయిస్తున్నారు.

కాని మొన్న విజయనగరంలో జగనన్న వసతి దీవెన పథకానికి శ్రీకారం చుట్టే సమయంలో ముఖ్యమంత్రి తన అంతరంగాన్ని బయట పెట్టారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన ట్వీట్ పరిశీలించితే రాష్ట్రంలోని ప్రతి పక్షాల గురించి వాళ్ళు చేస్తున్న విమర్శలకు ఏ మాత్రం భయపడటం లేదని ఆయనకు వ్యతిరేకంగా వున్న మీడియా ప్రచారం గురించే ఆందోళన చెందుతున్నారని పిస్తోంది. తానిప్పుడు యుద్దం చేస్తున్నది విపక్షాలతో కాదని ఉన్మాదులు రాక్షసులతో పోరాడుతున్నానని చెబుతూ ఏమీ లేకపోయినా విపరీతమైన రాతలు ప్రసారాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. దుష్ప్రచారం చేస్తున్న పత్రికలను ఛానల్స్ ను ఏమనాలని ఆగ్రహం వెలుబుచ్చారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఈ మధ్యకాలంలో శాసన సభ లో తప్ప చంద్రబాబు నాయుడు విమర్శలకు లేదా పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ముఖ్యమంత్రి నేరుగా సమాధానం చెప్పింది లేదు. ఇప్పుడు బహిర్గతమైన ముఖ్యమంత్రి అంతరంగం పరిశీలించితే ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలకన్నా వాటికి విస్తృత ప్రచారం ఇస్తున్న మీడియానే రాష్ట్రంలో తనకు ప్రధాన శత్రువుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

దురదృష్టమేమంటే తెలుగు మీడియా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచారంకన్నా రాజకీయ ప్రేరణ లేకుండానే జాతీయ మీడియా ఇటీవల కాలంలో వెలువరించిన వార్తలు సంపాదకీయాలు ముఖ్యమంత్రి ప్రతిష్ట బాగా దెబ్బ తీసింది. ఈ అంశం ముఖ్యమంత్రి గమనంలోనికి తీసుకున్నట్లు లేదు.