ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ఎన్నికల పొత్తు పొడవనున్నదా?

Chandra Babu Naidu

రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ తన సహచర నేతలతో కలసి సమావేశమయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపితో కలసి వామపక్షాలు పోటీ చేసే అంశంపై చర్చలు జరిగినట్లు ప్రచారంలోనికొచ్చింది. ఇటీవలగా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి నిర్వహించే కార్యక్రమాల్లో సిపిఐ నేత రామకృష్ణ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడును వైకాపా శ్రేణులు నిలువరించిన సమయంలో రామ కృష్ణ హాజరైనారు. ప్రధానంగా రాజధాని రైతుల పోరాటంలో ప్రత్యక్షంగా సిపిఐ పాల్గొనడమే కాకుండా మరో నేత నారాయణ ముఖ్యమంత్రిపై ఘాటుగా విమర్శలు చేసి వున్నారు.

అయితే ఈ సమావేశానికి ముందే రాష్ట్రంలోని వామపక్షాలు ఉమ్మడిగా ఏర్పడి పోటీ చేసే అంశంపై చర్చలు సాగించి వున్నారు. దాదాపు 12 వామపక్ష పార్టీలు గ్రూపులు కలసి పోటీ చేయాలనే ప్రతిపాదన వుంది. వీరందరూ కలసి టిడిపితో పొత్తు పెట్టుకుంటాయనే విషయంలో కొన్ని అభ్యంతరాలు వున్నాయి. సిపిఐ లాగా సిపిఎం తెలుగు దేశంతో పొత్తు పెట్టుకుంటుందా? అనేది చర్చనీయాంశమే. రాజధాని రైతులు ఉద్యమాన్ని సిపిఎం సంపూర్ణంగా బలపరచినా చంద్రబాబు నాయుడుతో కలసి సిపిఐ వ్యవహరించే లాగా సిపిఎం పోరాటాల్లో పాల్గొనలేదు. ప్రధానంగా రాజధాని భూములు సమీకరణలో టిడిపితో సిపిఎంకు విభేదాలు వున్నాయి.

అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాల అంశంలో సిపిఎం ఏకీభవించడం లేదు. ఈ నేపథ్యంలో సిపిఎం చంద్రబాబు నాయుడుతో కలసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించితే రాష్ట్రంలోని అన్ని వామపక్షాలు కలసి టిడిపితో పొత్తు పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం బాల్ సిపిఎం కోర్టులో వుంది.గత సాధారణ ఎన్నికల్లో జనసేనతో కలసి వామపక్షాలు పోటీ చేసి చేదు అనుభవాలు మిగుల్చుకున్నాయి. . ప్రస్తుతం జనసేన బిజెపితో పొత్తు పెట్టుకున్నందున వామపక్షాలకు మిగిలింది ఒక్క టిడిపినే. ఒక వేళ టిడిపి వామపక్షాలు అన్నీ కలసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఇందుకు సిపిఎం అంగీకరించితే వైకాపాకు మంచి పోటీ ఇవ్వగలరు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు జరిపినా కోస్తా మూడు నాలుగు జిల్లాల్లో రాజధాని సెంట్ మెంట్ ముందు సంక్షేమ పథకాలు బలాదూర్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి వుండే వెసులుబాటు వుండనే వుంటుంది.

ఈనేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ఎన్నికల పొత్తు పొడవాలంటే మార్క్సిస్టు పార్టీ నేతల నిర్ణయంపై ఆధార పడివుంది. ప్రస్తుత పరిణామాలు పరిశీలించితే ఒక వేళ మార్క్సిస్టు పార్టీ టిడిపితో పొత్తు వ్యతిరేకించినా కమ్యూనిస్టు పార్టీ టిడిపితో కలసి పోటీ చేసే అవకాశం తోసి పుచ్చలేము. కొన్ని సందర్భాల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా నడిచిన సందర్భాలున్నాయి. కాని మార్క్సిస్టు పార్టీ వైకాపాతో కలసి పోటీ చేస్తుందని మాత్రం భావించ లేము