ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ రమేష్ కుమార్‌కు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ కేంద్రం హోం శాఖకు రాసినట్లుగా ఓ లేఖ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది. గురువారం నాడు ఉదయం నుండి నలుగురు గన్ మెన్లను సెక్యూరిటీగా నియమించింది. అలాగే బుధవారమే హైదరాబాద్ చేరుకున్న రమేష్ కుమార్ ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదని తెలుస్తోంది.

ఎన్నికలు వాయిదా వేసిన నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసినట్లుగా ఓ లేఖ బైటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖ తాను రాయలేదని ఏఎన్ఐ వార్తా సంస్థకు రమేష్ కుమార్ వెల్లడించారు. అలాగే ఆ లేఖ వ్యవహారానికి సంబంధించి.. ముఖ్యమంత్రి జగన్, డీజీపీ సవాంగ్, ఐబీ చీఫ్ మనీష్ కుమార్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న లేఖ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్టు సమాచారం.

ఏది ఏమైనా రమేష్ కుమార్ పేరిట హల్చల్ చేస్తున్న లేఖ ఇప్పుడు రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. పైగా ఇప్పటి వరకు ఉన్న 1+1 గా ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు 4+4కు పెంచడంపై కూడా పలు ఊహా గానాలు వినబడుతున్నాయి.