ఆంధ్రదేశపు ‘చిన్నబాబు’ చుట్టూ చాలా ఆసక్తికరమయిన చర్చ నడుస్తూ ఉంది.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనబడే చిన్నబాబు వచ్చే ఎన్నికల్లో ఏమి చేస్తాడు? కేవలం ఇతర సభ్యలకు ప్రచారం చేసిపెట్టి, తాను పోటీ చేయకుండా పరువు కాపాడుకుంటాడా? లేక పరువు సమస్య అని ఎన్నికల్లో వీరోచితంగా తలపడతాడా?
‘లోకేశ్ నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేడా అనే దిగులు చంద్రబాబు నాయుడిని పీడిస్తూ ఉంది’ని జనసేనాని పవన్ కల్యాణ్ ఒక బాణమేసి ఈ చర్చ మరింత రక్తి కట్టేలా చేశాడు.
పవన్ కల్యాణ్ అన్న ఈ మాటకు చాలా వెయిటుంటుంది. ఎందుకంటే, మొన్న మొన్నటిదాక పవన కల్యాణ్ ఆశిబిరంలో ఉన్నడే. చంద్రబాబుకు బాగా ఇష్టమయిన వాడుకూడా. ప్రత్యేకంగా విమానం పంపి, పిలిపించుకుని, ఆ రాజధాని ఏరియాలో ‘నీ రైతాంగా ఉద్యమం మానేయ్ సామీ’ సలహా ఇచ్చినోడే. అలాంటి పవన్ తో కొడుకు భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు ఎపుడో ఒకసారి ముచ్చటించి ఉంటాడని అనుకోవచ్చు. లేదా తను కన్న కలలను చిన్న బాబు నిజం చేస్తాడా అనే అనే శంక వ్యక్తం చేసి ఉండవచ్చు. ఏదో ఒకసంకేతం చంద్రబాబు నుంచో లేదా టిడిపిలో ఉన్న ఇతర ప్రముఖులనుంచో వచ్చిఉండకపోతే, విశాఖలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఉన్న లోకేష్ దిగులు గురించి ఎలా చెప్పగలడు? జస్ట్ ఆస్కింగ్!
ఆ మాట కొస్తే చిన్నబాబు లేకపోతే ఆంధ్ర రాజకీయాల్లో రక్తేముంది?
చాలా సిరియస్ గా సాగుతున్న తెలుగు రాజకీయాలను అపుడపుడూ నాలుక్కరుచుకుంటూ రక్తకట్టిస్తున్నది లోకేషేగా. ఎవ్వరికీ అనుమానంఅక్కర్లే.
లోకేశ్ బాల మేధావి అని రుజువుచేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆయన సలహా మేరకే ఒక ఇరవైయేళ్ల కిందట (అపుడు లోకేశ్ వయసు ఎంత అని పిచ్చి పిచ్చి ప్రశ్నలేయకండి) ప్రధాని పదవిని చంద్రబాబు నాయుడు తృణీ కరించాడని ముఖ్యమంత్రి నాయుడు స్వయంగా చెప్పారు. అయితే, ఇదంతా లోకేశ్ బాబు రాజకీయాల్లోకి రాకమునుపటి ముచ్చట. తీరా ఆయన రాజకీయాల్లోకి వచ్చా అంతా కన్ ఫ్యూజన్. ఆయన నొరు తెరిస్తే సంచలన వార్త అవుతూ ఉంది. అందుకే నంద్యాల ఎన్నికలపుడు నవ్వుల పాలు కాకుండా ఉండేందుకు ప్రచారం బాధ్యత నుంచి తప్పించారని చెబుతారు. ఇలాంటి లోకేష్ బాబుకు చెందిన ప్రతి అంశం ఎందుకు చర్చనీయాంశం కాదూ? ఇలాంటి 2019 ఎన్నికల్లో చిన్న బాబు రోలేమిటి?
ఆయన పోటీ చేస్తారా లేదా, సస్పెన్స్. పోటీ చేస్తే నియోజకవర్గం ఏది, సస్పెన్స్. ఈ మధ్య కొంతమంది ముఖ్యమయిన అభ్యర్థులపేర్లను అంటే తప్పకుండా గెలుస్తారనే వారి పేర్లను ప్రకటించారు. కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుక పోటీచేస్తుందని, కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్ వి మోహన్ రెడ్డి పోటీచేస్తారని స్వయంగా నారాలోకేషే ప్రకటించారు. వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని లోకేష్ ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇన్ని నెలల ముందే వారి పేర్లను ఎందుకు ప్రకటించారు? ఎందుకంటే, వాళ్లు తప్పక గెలుస్తారనేకదా, ఆరునెలల ముందే వారి పేర్లను ప్రకటించినా, అపోజిషన్ వైసిపి పార్టీ ఏమీ చేసుకోలేదన్న ధీమాయే.
మరి ఆధీమా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ విషయంలో లేదా?
లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఎందుకు ప్రకటించడం లేదు? ప్రకటిస్తే, వైసిపి ప్రతివ్యూహం చేసి, లోకేశ్ ను అసెంబ్లీలో కాలు పెట్టకుండా చేస్తుందని భయమా? టిడిపి ప్లాన్ ను ఎగస్పార్టీ కకావికలుచేస్తుందని అనుమానమా?
అసలు పోటీచేయిస్తారా? లేక కౌన్సిలే సురక్షితమని అక్కడే ఉంచుకుంటారా? ముఖ్యమంత్రి కావలసిన వ్యక్తి అసెంబ్లీకి గెలవాల్సిన అవసరం లేదని కొణిజేటి రోశయ్య రుజువుచేశారు. కాబట్టి లోకేశ్ కు మండలి సేఫ్ హావెన్ అనుకుంటున్నారా?
2019 ఎన్నికల్లో లోకేష్ నిలబడటం ఖాయమని టిడిపి నేతలుచెబుతున్నారు. ఎక్కడ నుంచి పోటీచేస్తారో చెప్పడం లేదు. సురక్షితంగా ఉండే కుప్పం (తండ్రి వారసత్వం) నుంచా లేక హిందూపూరం (మామ వారసత్వం) నుంచా? అమరావతి క్యాపిటల్ రిజియన్ నుంచా?
యువరాజా వారికి ఈ ఎన్నిక తప్పకుండా రికార్డు మెజారిటీతో గెలవాల్సిన అవసరంచాలా ఉంది. ఆయన బాల మేధావియే కాదు, బాలవీరుడు అని రుజువు కావాలి. కొడుకును కుర్చీమీద సునాయాసంగా కూర్చోబెట్టిన సంతృప్తి చంద్రబాబుకు ఉండాలి.
టిడిపి నేతలు ఎన్నయినా చెబుతున్నారు గాని, అసలు విషయం చెప్పడం లేదు. దాన్ని బ్రహ్మరహస్యం లాగా కాపాడుతున్నారు. చంద్రబాబును ఓడించడం కంటే కూడా లోకేశ్ నుంచి ఓడించి, చంద్రబాబు కల భగ్నం చేయాలన్నదానికి వైసిపి ఎక్కువ శ్రద్ధచూపిస్తుందనే భయం టిడిపిలో బాగా కనబడుతూ ఉంది. అందుకే లోకేశ్ ఎన్నికల్లో పోటీ చేసేవిషయం ఒక సస్పెన్స్. ఎక్కడ నుంచి పోటీ చేసేది సస్పెన్స్. అయితే, తెలుగుదేశం వర్గాల్లో ఒక వాదన వినబడుతూ ఉంది. రాష్ట్రంలో కుప్పం తప్ప లోకేశ్ కు మరొక సురక్షితమయిన నియోజకర్గం లేదనేది ఆ వాదన (ఈ విషయాన్ని చాలా మెల్లిగా చెబుతున్నారు). నాయుడిగారి పెట్టని కోటలో వైసిపి మూకలు కాలుమోపలేరని, కుట్రలు చేయలేరని నమ్మకం. ఇంకెక్కడ ఆయన నామినేషన్ వేసినా జగన్ సైన్యం పార్టీకి పెద్ద టెన్షన్ క్రియేట్ చేస్తుందని లోలోన భయం పీడిస్తూ ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఈ సారిలో లోక్ససభకు పోటీచేసి చిన్నబాబును కుప్పంనుంచి పోటీ చేయించి, రికార్డు స్థాయి మెజారిటీ తెప్పించి వీరవిజేతను చేస్తారు. మరొక ఆప్షన్ మామ బాలయ్య చేత హిందూపురం ఖాళీ చేయించడం. అది కూడా రిస్కీ వ్యవహారమే. ఎందుకంటే, గతంలో ఎన్టీరామారావు మహబూబ్ నగర్ జిల్లాలో జె చిత్తరంజన్ అనే అనామక కాంగ్రెస్ క్యాండిడేట్ చేతిలో ఓడిపోయిన కథ పునరావృతమయితే… చాలా ప్రమాదం.
పోనీ వరల్డ్ క్లాస్ అమరావతి ఏరియా ఎలా ఉంటుంది? వరల్డ్ క్లాస్ క్యాపిటల్ చేస్తామని ప్రకటిస్తున్నా, క్యాపిటల్ రీజియన్ నుంచి పోటీ చేస్తే, అదికూడా ప్రమాదమే. ఎందుకంటే, రైతులందరికి భూములు తిరిగిస్తానని వైఎస్ జగన్ ప్రకటించాడు. ఈ దెబ్బతో క్యాపిటల్ రిజియన్ రైతులు వెన్నుపోటుపొడిస్తే… అమ్మో అదొక సమస్య.
అందువల్ల ఏమ్మాట్లాడకుండా చిన్నబాబుని కాపాడుకుంటూ రావాలని, కుట్రలు పన్నే అవకాశం వైసిపి ఇవ్వకుండా ఎన్నికల తేదీలోచ్చి నామినేషన్ వేసేదాకా ఆయన పోటీ విషయం రహస్యంగా కాపాడాలని పండితులు నిర్ణయించారని మాకు తెలిసింది.