అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అమరావతి నిర్మాణ పనుల్ని ఆపేశారు వైఎస్ జగన్. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి అమరావతి ఆశల్ని ఆవిరి చేశారు. దీంతో రాజధాని కోసం భూమిలిచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. కానీ సర్కార్ మాత్రం మూడు రాజధానుల బిల్లును పాస్ చేయడం కోసం కసరత్తులు చేసింది. కానీ గత మండలి సమావేశంలో బిల్ పాస్ కాలేదు. ఆ తరవాత వైకాపా కీలక నేతలు ఇప్పుడప్పుడే రాజధానుల ప్రస్తావన ఉండదని అనడం, మంత్రి బొత్స సత్యనారాయణ వెళ్లి అమరావతిలోని నిర్మాణాలను పరిశీలించడంతో రాజధాని విషయంలో సర్కార్ మనసు మారిందేమోనని అంతా అనుకున్నారు.
Read More : నాగచైతన్య కెరీర్ బెస్ట్ బిజినెస్ ఇదేనా?
కానీ బొత్స పరిశీలన వెనుక చాలా పెద్ద స్కెచ్ ఉందని ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. బొత్స సత్యనారాయణ అమరావతి విజిట్ అక్కడి భవనాల అమ్మకం కోసమని అంటున్నారు. చంద్రబాబు హయాంలో 63 రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణం మొదలైంది. ఒక్కొక టవర్లో 12 అంతస్థులు ఉంటాయి. మొత్తంగా అన్నిటిలో కలిపి 4200 వరకు ఫ్లాట్లు ఉంటాయి. 80 శాతం వరకు కట్టడం పూర్తైంది. అలాగే మంత్రులు, ఐఎఎస్ అధికారులు, న్యాయమూర్తుల కోసం 180 బంగళాల నిర్మాణం కూడా చేపట్టారు. వాటి నిర్మాణం కూడా కొంతమేర పూర్తైంది. ఇప్పుడు వాటి మిగులు నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో సీఆర్డీయే అధికారులతో లెక్కలు వేయిస్తున్నారట.
Read More : జూలై 26 ముహూర్తానికే యూత్ స్టార్ ఫిక్స్
ఎందుకంటే మిగతా నిర్మాణాలను ముగించి అన్ని ఫ్లాట్లను, బంగళాలను అమ్మకానికి పెట్టాలనేది సర్కార్ ఆలోచనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇలా అమ్మడం ద్వారా గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు, ఇప్పుడు కొత్తగా చేయబోయే ఖర్చులు కలిపి అన్నీ పోను 2500 నుండి 3000 కోట్ల వరకు ఆదాయం గడించవచ్చని ప్రభుత్వం ఆలోచనట. కానీ రాజధాని కాని అమరావతిలో భవనాలు ఎవరైనా కొంటారా అంటే అనుమానమే. అందుకే ప్రభుత్వం చుట్టుపక్కల ఉన్న మార్కెట్ ధర కంటే 20 నుండి 30 శాతం వరకు తగ్గిస్తే కొనుగోలుదారులను ఆకర్షించవచ్చని భావిస్తోందట. మరి ఈ అమ్మకం వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజుల ఆగాల్సిందే.