ఎన్నికల వాయిదాపై మాట మార్చిన వైకాపా నేతలు..!

స్థానిక ఎన్నికల‌కు ఫుల్ జోష్‌లో సిద్ధమైన వైకాపా నేతలు, శ్రేణులకు ఈసీ ఎన్నికల వాయిదా నిర్ణయం తొలుత కాస్త అయోమయానికి గురిచేసినట్లుంది. ఈసీ నిర్ణయం వెలువడిన వెంటనే.. అది తమ విజయం అన్నట్లుగా మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ సైతం.. సీఎం జగన్ ప్రెస్ మీట్‌ పెట్టి ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేయగానే గంటల వ్యవధిలో తూచ్ అన్నారు.. మాట మార్చేసి.. జగన్‌కు కోరస్‌ ఎత్తుకున్నారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈసీ ఎన్నికలు వాయిదా వేయడంతో జగన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా వెనక్కి తీసుకునేలా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఎక్కడిదాకా అయినా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయంపై సీఎం జగన్ స్వయంగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల వాయిదా అసంబద్ధం అంటూ, ఈసీని పిలిచి వాయిదాను వెనక్కు తీసుకునేలా చేయాలని కోరారు. సీఎం అయ్యాక ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టని జగన్ ఈ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అయితే ముందుగా పార్టీ లైన్ తెలియని కొందరు వైకాపా నేతలు వాయిదా నిర్ణయం వెలువడ్డ వెంటనే ఈసీకి మద్దతుగా నిలిచారు. కరోనా నిరోధానికి ఈసీ తీసుకున్న ఇర్ణయం సరైందే అంటూ వైకాపా ఎమ్మెల్యేలు కొందరు స్పీ‌చ్‌లు ఇచ్చారు. ఉత్తరాంధ్ర, రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు సైతం అదే బాట పట్టారు. కరోనా ప్రచారం చేశారు. వారి మాటలు, స్పీచ్‌లు మీడియాలో ప్రసారం అవుతుండగానే.. సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఈసీకి మద్దతుగా నిలిచిన వారిపై అధిష్టానం బాగా ఫైర్ అయ్యినట్లుంది. వెంటనే తమ మాటలు వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు వెళ్లినట్లు ఉన్నాయి. దీంతో అప్పటి వరకు ఈసీని వెనకేసుకొచ్చిన వైకాపా ఎమ్మెల్యేలు వెంటనే మాట మార్చేశారు.. అన్నిటికి చంద్రబాబే కారణమని, కేంద్ర నిధులు వెనక్కి వెళ్లిపోతాయని రాగం అందుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సినది జరిగిపోయింది. కాబట్టి ఏ విషయం అయినా పార్టీ కాస్త ముందుగా తమ విధానం ఏంటి అన్నది చెబితే బాగుటుందని, మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా ఉంటుందని అధిష్టానానికి విన్నవించుకున్నారట.