అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తున్న కోడెల

మాయమైన ఫర్నీచర్ విషయంలో అడ్డంగా దొరికిపోయిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇపుడు బుకాయింపులకు దిగారు. అసెంబ్లీలో మాయమైన ఫర్నీచర్ తన దగ్గరే భద్రంగా ఉందని ఒప్పుకున్నారు. ఫర్నీచర్, కంప్యూటర్లకు అసెంబ్లీలో భద్రంగా ఉండదని తన దగ్గర పెట్టుకున్నట్లు చెత్త కథలు చెబుతున్నారు ఇపుడు.

మాయమైన ఫర్నీచర్ విషయంలో పోలీసులు విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణ అంటే వ్యవహారం అరెస్టు దాకా వెళుతుందన్న భయంతోనే కోడెల కొత్త నాటకం మొదలుపెట్టారు. తన ఇంట్లోను, క్యాంపు కార్యాలయంలో ఫర్నీచర్ ను వాడుకున్నట్లు కోడెల అంగీకరించారు. ఆ ఫర్నీచర్ ను అసెంబ్లీకి చేర్చమని అంటే చేర్చేస్తానని లేదా వాటి విలువ చెల్లించమని చెప్పినా చెల్లించేస్తానంటూ ఇపుడు చెబుతున్నారు.

అధికారంలో నుండి దిగిపోగానే ఫర్నీచర్ విషయంపై అధికారులు ప్రస్తావించినా కోడెల సమాధానం చెప్పలేదు. పైగా అసెంబ్లీ నుండి వచ్చిన ఉత్తరాలకు సమాధానం కూడా ఇవ్వలేదు. అలాంటిది తన దగ్గరున్న ఫర్నీచర్ ను తీసుకెళ్ళమని తాను ఉత్తరాలు రాసినా అసెంబ్లీ అధికారులు స్పందించలేదని ఇపుడు బుకాయిస్తున్నారు.

కోడెల నాటకం చూస్తుంటే తనను అరెస్టు చేయవద్దని ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లే ఉంది. ఫర్నీచర్, కంప్యూటర్లను దొంగతనం చేసిన నేరంపై మరి ప్రభుత్వం కోడెలపై ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.