సంచయిత గజపతిరాజు వైకాపాకు బలమా? భారమా?

నాలుగు రోజుల వరకు సంచయిత గజపతి రాజు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఉన్నట్లుండి మొన్న మంగళవారం 3 వతేదీ అర్థరాత్రి హఠాత్తుగా తెర మీదకు వచ్చారు. అప్పటి నుండి సంచయిత హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఆమె గతం గురించి తవ్వితీయడం మొదలైంది.టిడిపి నేత అశోక్ గజపతి రాజును పదవుల నుండి దించడంలో వైకాపా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు గల మాన్సాస్ ట్రస్టు నుండి తొలగించగలిగింది. ఇందుకు బిజెపి నేపథ్యం గల సంచయిత ఒక ఆయుధంగా మారింది.సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ గాను మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గాను సంచయితను వైకాపా ప్రభుత్వం గద్దె ఎక్కించింది. కాని తదనంతర పరిణామాలు మాత్రం ముఖ్యమంత్రికి మింగుడు పడే విధంగా లేవు . సంచయిత గత చరిత్ర వైకాపా ప్రభుత్వంపై ఈపాటికే వెల్లువెత్తున్న ఆరోపణలను మరింత బలపర్చే విధంగా వుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే హాల్ చల్ చేస్తోంది. ఆమె ట్వీట్ లు కూడా వివాస్పదంగా వున్నాయి.

ఢిల్లీలో బిజెపి నేతగా నేపథ్యం గల సంచయిను వైకాపా ప్రభుత్వం అడ్డదారిలో నియామకం చేసిందని తుదకు రాష్ట్ర బిజెపి నేతలు కూడా విమర్శలకు దిగారు. ఉత్తరాంధ్రకే చెందిన బిజెపి నేతలు ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచయితను బిజెపి నుండి బహిష్కరించమని అధిష్టాన వర్గాన్ని కోరుతానన్నారు. ఆమె పార్టీ ఫిరాయించ వలసి వుంటుందేమో.
టిడిపి నేతకు చెక్ పెట్టేందుకు వైకాపా మరీ వెతికి సంచయితను బరిలో దింపినట్లయింది.ఆమెకు బిజెపి నేపథ్యం వున్నా అన్నింటికీ సిద్ధమై పదవులు చేపట్టినట్లుంది.ఇవన్నీ అటుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఎంతో ఆస్తులు ఆదాయం పేరు ప్రతిష్టలు కలిగి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతూ హైందవ సాంప్రదాయానికి ప్రతిరూపంగా వున్న సింహాచలం దేవస్థానం చైర్మన్ బాధ్యతలు చేపట్టిన సంచయిత గురించి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సమాచారం దిగ్భ్రాంతి కరంగావుంది. ఆమె ఆహార్యం పైగా అన్య మతపరమైన భావజాలం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టులు పెడుతున్నారు. ఒకరైతే వాటికన్ సిటీకి సంహాచలంకు సంచయితతో వారధి కనిపెట్టినందుకు ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పారు.

సింహాచలం దేవస్థానం చైర్మన్ గాను మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గాను బాధ్యతలు చేపట్టిన సంచయితకు ఈ విమర్శల వలన జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ విజయనగరంలో వుండింది లేదు. రాజకీయంగా వ్యక్తిగతంగా ఆమెకు జరిగే నష్టం ఏమీ లేదు.కాని తొలుత బిజెపి ప్రజలకు జవాబు చెప్పుకోవాలి. అన్యమత పరమైన భావాలు గలిగిన సంచయితను ఇన్నాళ్లూ జాతీయ అధికార ప్రతినిధిగా ఎందుకు కొనసాగించారు?రెండవ అంశం. హిందూమత సనాతన ధర్మ ఆచారాలకు నిలయమైన సింహాచలం దేవస్థానం చైర్మన్ గా పాశ్చాత్య అహార్యం అన్య మత భావజాలం గల సంచయితను రాష్ట్ర ప్రభుత్వం ఎలా నియమించింది?ఈ పాటికే అన్యమతం వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడుతోందని బిజెపి నేతలే ఆరోపించుతున్నారు. ఈ సందర్భంలో విశేషమేమంటే బిజెపిలోనే ఇంత కాలం అన్యమత భావాలు గల నేత వుండటం విమర్శలకు తావిస్తుందేమో.