భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ కార్యక్రమాలకు పవన్ దూరంగా ఉంటున్నారని, పార్టీ బాధ్యతలనంతా నాదెండ్ల మనోహర్ మీదనే వేసారనే చర్చ జరుగుతోంది. అయితే చాలా కాలంగా పవన్ కళ్యాణ్ – నాదెండ్ల మనోహర్ గురించి సోషల్ మీడియాలో జోక్స్ విపరితంగా సర్క్యులేట్ అవుతూనే వస్తున్నాయి. నాదెండ్ల మనోహర్ ఏది చెప్తే పవన్ అదే చేస్తారని, జన సేన పార్టీని ఆయనే నడిపిస్తున్నారని కూడా విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు వాటిపై నోరువిప్పని పవన్.. ఇప్పుడు చాలా కూల్‌గా సమాధానమిచ్చారు.
2019 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పవన్ కళ్యాణ్ అన్నీ తానై పార్టీ శ్రేణులను నడిపించాడు. ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా సరే పెద్ద ఎత్తున యువత తరలివచ్చేది. అయితే ఫలితాలు మాత్రం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చాయి. దీంతో ఆయన తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు చూస్తే జనసేనలో చేరిన ఏ నాయకుడికీ అంత ప్రాధాన్యం కూడా కనిపించలేదు. పవనే అన్నీ తానై పార్టీని నడిపించారు. కానీ ఎన్నికల తర్వాత పవన్ మారారు.
పార్టీ పటిష్ట నిర్మాణానికి, అలాగే పార్టీలోని ఇతర నాయకులకు ప్రజల్లో ఎలా గుర్తింపు కోసం వారికి స్వేఛ్చను ఇస్తున్నారు. ఇదే విషయాన్ని పవన్ తాజాగా వెల్లడించారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటన మొత్తం మనోహర్ ఒక్కరే పూర్తి చేయడంతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు మనోహర్ దిశానిర్దేశం చేయడంపై క్లారిటీ ఇచ్చారు. అనుభవం ఉన్న నేతలు, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న వారు పార్టీలో ఇన్షియేటివ్ తీసుకుంటే తప్పేమీ లేదని, అది పార్టీకి మంచే చేస్తుందన్న సందేశాన్ని పార్టీ శ్రేణుల్లోకి పంపారు.
పైగా సాధారణ ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉన్నందున జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజాసమస్యలపైనే పోరాడాలని, పార్టీని బలోపేతం చేసేందుకు ఇది అవసరమని కూడా పవన్ భావిస్తున్నారట. ఇవన్నీ చూస్తుంటే.. మొత్తానికి ప్రజాక్షేత్రంలో ఎలా మెలగాలి, రాజకీయాల్లో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అనే దానిపై పవన్ ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది.