ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీని పెట్రోల్ వేసి తగలెట్టేశారంటూ వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ మీద రాష్ట్రం అదనంగా పెంచింది ఏమీ లేదనీ, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన విడుదల చేసిందనీ, కేంద్రమే పెట్రోల్, డీజిల్ ధరల్ని 25 నుంచి 50 రూపాయల దాకా తగ్గించాల్సి వుందని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ బీజేపీ.. ‘పెట్రో వార్’ నడుస్తున్న విషయం విదితమే. రాష్ట్ర ప్రభుత్వమేమో తాము అదనంగా పన్నులు పెట్రో ఉత్పత్తులపై పెంచలేదని అంటోంది. కేంద్రమేమో తాము తగ్గించాం గనుక, రాష్ట్రాలూ తగ్గించాలంటోంది. దాంతో, పంచాయితీ ఎటూ తేలడంలేదు.
కాగా, రాష్ట్ర పరిధిలోని వ్యాట్ తగ్గిస్తే తద్వారా కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ఇస్తుందా.? ఇచ్చు ఉద్దేశ్యం వుంటే వ్యాట్ తగ్గించడానికి సిద్ధమేనని కొడాలి నాని సవాల్ విసరడం గమనార్హమిక్కడ.
అయితే, కేంద్రం పద్మశ్రీ అవార్డులు అర్హులైన పేదవాళ్ళకీ అందిస్తోందనీ, రాష్ట్ర ప్రభుత్వం బూతు పుష్పాల పేరుతో అవార్డులు ఇచ్చేలా వుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కొడాలి నాని మీద సెటైర్లు వేశారు.
ఏదిఏమైనా, రాష్ట్రంలో పెట్రో మంట చుట్టూ ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా, వైఎస్ జగన్ సర్కారుని ప్రశ్నిస్తూ అభాసుపాలవుతోంది. ప్రతిపక్షం హోదాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి, అదే సమయంలో కేంద్రాన్నీ ప్రశ్నిస్తే.. టీడీపీ విశ్వసనీయత బయటపడేదేమో.