ఫ్లాష్ … ఫ్లాష్… ఫ్లాష్…. ఆంధ్ర పోలీస్ బాస్ గా ఆర్ పి ఠాకూర్

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సీనియర్ ఐపి ఎస్ అధికారి ఆర్ పి ఠాకూర్ ను  రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.  ఈ మేరకు  ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఆయన 1986 బ్యాచ్ కు ఐపిఎస్ అధికారి. ఆయన 1961 జూలై 01 న జన్మించారు. ఐఐటి  కాన్పూర్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివిన ఠాకూర్, 1986లో ఐపిఎస్ కు ఎంపికయ్యాక ఆంధ్రప్రదేశ్ క్యాడర్ గా వచ్చారు.

 

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ డిసెంబర్ 15 న ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.   హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమి తొలి అదనపు ఎస్పీగా నియమితులయ్యారు.

గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ఎ ఎస్ పి గా బాధ్యతలు నిర్వహించారు, పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్ జిల్లాల ఎస్పీలుగా పని చేశారు.

హైదరాబాద్ డీసీపీ గా , అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పాట్నా లోని ఈస్ట్రన్ జోన్ హెడ్ క్వాటర్స్ (CISF) డీఐజీ గా కూడా పని చేశారు.  ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్ లోని డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డీజీ గా పని చేశారు.

ఎడిజి హోాదాలో ఉమ్మడి  తెలుగు రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఎడిజిపి  (లా అండ్ ఆర్డర్) గా బాధ్యతలు స్వీకరించారు.

2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్నారు. 2003 లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఎఎస్ ఎస్ పి  మెడల్ సాధించిన ఆర్ పి ఠాకూర్, పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011 లో భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా మెడల్  పొందారు. ఇపుడు పోలీసు బాసయ్యారు.