పోలవరంపై కేంద్రం ఆసక్తి..కారణాలు తెలుసా ?

రాష్ట్ర రాజకీయాల్లో రచ్చకు కేంద్రబిందువైపోయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం తీసేసుకుంటోందా ? గ్రౌండ్ లేవల్లో జరుగుతున్నది చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పోలవరం అథారిటితో బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు, నేతలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రమే తీసుకుంటే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైందట. అంటే దానికి తగ్గట్లే అథారిటి కూడా ఓ నివేదికను కేంద్రానికి పంపుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నిజానికి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. కాకపోతే చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి పెట్టి ప్రాజెక్టును తన చేతిలోకి లాక్కున్నారు. అప్పటి నుండి ప్రాజెక్టులో అవినీతి ఆకాశమంత పెరిగిపోయింది. అధికారం మారిన తర్వాత ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే కేంద్రం-జగన్-చంద్రబాబు మధ్య సమస్య మొదలైంది.

అవినీతిని బయటపెట్టేందుకు జగన్ తీసుకున్న నిర్ణయం ఇటు కేంద్రానికి సహజంగానే చంద్రబాబుకు ఏమాత్రం నచ్చలేదు. రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయం తగ్గించటం జగన్ లక్ష్యం. అలాగే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు నిపుణుల కమిటిని వేశారు. విచిత్రమేమిటంటే జగన్ నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సిన కేంద్రం, చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నట్లే అనుమానంగా ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ను బిజెపి, చంద్రబాబు వ్యతరేకిస్తుండటం. రెండు పార్టీలకు జగన్ కొరకరాని కొయ్యలాగ తయారవుతున్నారు. అందుకే మళ్ళీ జగన్ కు వ్యతిరేకంగా రెండు పార్టీలు కలుస్తున్నాయా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రాజెక్టును కేంద్రం తన చేతిలోకి తీసుకోబోతోందంటూ జరుగుతున్న ప్రచారం కూడా ఇందులో భాగమేనేమో ?