తెలుగుదేశంపార్టీ మాజీ ఎంఎల్ఏ కూన రవికుమార్ పరారీలో ఉన్నారు. అవును మీరు చదివింది నిజమే. ప్రభుత్వ అధికారులను బెదిరించిన వ్యవహారంలో కూనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేద్దామని వెళ్ళిన పోలీసులకు ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడా కనబడలేదు కూన.
ఇంతకీ విషయం ఏమిటంటే స్పందన కార్యక్రమంలో భాగంగా కూన ఆముదాల వలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలంలోని ఎంపిడివో కార్యాలయానికి వెళ్ళారు. మొన్నటి వరకూ ఇదే నియోజకవర్గంలో ఎంఎల్ఏగా విప్ గా పనిచేసిన కూనకు అధికారులను బెదిరించి పని చేసుకోవటం అలవాటైపోయిందని వైసిపి నేతలు మండిపడుతున్నారు.
అలవాటులో భాగంగానే సురుబుజ్జి ఎంపిడివో తో పాటు మరో అధికారిణిని కూడా నోటికొచ్చినట్లు తిట్టారు. ఎంపిడివోనైతే నేరుగా కార్యాలయానికి వెళ్ళి బెదిరించారు. తనను ఎవరు ఏమీ చేయలేరని, తలుపులు వేసేసి బాదేసినా అడిగే దిక్కుండదంటూ తీవ్రంగా తిట్టారు. అలాగే మరో అధికారిణిని కూడా ఫోన్లో బెదిరించారు. ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో వెంటనే జిల్లాలో కలకలం మొదలైంది.
సరే విషయం బయటపడిన తర్వాత ఎంపిడివోల సంఘంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా కూనపై మండిపడ్డాయి. తర్వాత ఎంపిడివో పోలీసులకు రాత మూలకంగా ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే పోలీసులు మాజీ ఎంఎల్ఏపై కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో కూన ప్రస్తుతం పరారీలో ఉన్నారని అంటున్నారు.