ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కేంద్రానికి పంపిన లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ లేఖ టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుండే పంపించారని, ఆయన సంతకం కూడా ఫోర్జరీ చేసారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరిపించాలని విజయసాయిరెడ్డి డిజిపికి ఫిర్యాదు చేసారు. దీంతో రంగంలోకి దిగిన సిఐడి లేఖ మూలాలను కనుగొనే పనిలో పడింది.
దర్యాప్తులో భాగంగా ఏపీ సిఐడి ఇప్పటికే ఒకసారి నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ సాంబమూర్తిని విచారించింది. కాగా మరోసారి హైదరాబాదులో సాంబమూర్తిని విచారిస్తోంది సిఐడి. అయితే మొదటిసారి జరిపిన విచారణలో సాంబమూర్తి సిఐడికి ఇలా చెప్పినట్టు తెలుస్తోంది. “సార్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చి డాక్యుమెంట్ ఒకసారి చూడమని చెప్పారు. ఆ డాక్యుమెంట్ ను చదివి నా డెస్క్ టాప్ కంప్యూటర్ లో కొన్ని కరెక్షన్లు చేసి ఇచ్చాను. తర్వాత పెన్ డ్రైవ్ సార్ కి ఇచ్చేసాను. తర్వాత ఆయన ఆ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపి ఉండవచ్చు అని సాంబమూర్తి చెప్పినట్లు సమాచారం.
ఐతే సిఐడి మరోసారి నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ ను విచారించడం పలు చర్చలకు దారి తీస్తోంది. నిమ్మగడ్డ కేసులో సాంబమూర్తి హాట్ టాపిక్ అయ్యారు. సిఐడి ఆయనను మరోసారి ఏయే అంశాలపై విచారించనుంది. సాంబమూర్తి ఏం చెప్పనున్నారు? ఇప్పటివరకు ఆయన నుండి సిఐడి ఏయే సమాధానాలు రాబట్టింది? ఇకపైన ఏం తేలనుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.