YSRCP : ఎన్నికలంటే జగన్ భయపడుతున్నాడని, రాష్ట్రం మొత్తం వైసిపి పట్ల వ్యతిరేకత ప్రబలిందని, వైసిపి వారు దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నారని, అభివృద్ధే లేదని, జగన్ తక్షణమే రాజీనామా చెయ్యాలని, ఉన్మాది పాలన అని గత ఏడాదిన్నరగా ఇల్లెక్కి ఆక్రోశిస్తూ పంచాయితీ ఎన్నికలు జరపాలని ఎన్నికల కమీషనర్ మీద ఒత్తిడి తెస్తూ అతివిశ్వాసంతో ఎగిరిపడిన చంద్రబాబుకు ఎన్నికల ఫలితాలు దిమ్మతిరిగేలా చేశాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లోనూ ఎనభై రెండు శాతానికి పైగా పంచాయితీలు దక్కించుకుని ప్రభంజనాన్ని సృష్టించింది. తెలుగుదేశం పార్టీ కోటి ఆశలు పెట్టుకున్న కృష్ణా, గుంటూరు జిల్లాలు సైతం వైసిపి ఊడ్చిపారేసింది. రాజధాని ప్రాంతంగా చెప్పబడుతున్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా వైసిపి మెజారిటీ స్థానాలు దక్కించుకుని తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
చంద్రబాబు ఎంత పెద్ద షాక్ తిన్నారో మొన్న ఆయన నిర్వహించిన పత్రికసమావేశంలో ఆయన ఉపన్యాసమే తెలియజేసింది. జేవురించిన ముఖంతో, జీరవోతున్న కంఠంతో, అసహజమైన ఆవేశంతో డిజిపి నుంచి ఒక పల్లెటూరిలో పనిచేసే ఎస్సై వరకు ప్రతి ఒక్కరిమీద విరుచుకుని పడ్డారు. ఉన్నతాధికారులను దూషించారు. ఎన్నికలు సరిగా జరగలేదని ఎన్నికల కమీషన్ ను కూడా నిందించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే హద్దులు లేని అసహనంతో రగిలిపోతున్నారని అర్ధం అవుతుంది. పదునాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు ఇంత దిగజారిపోయి మాట్లాడటం ఆయన చరిత్ర తెలిసిన ఎవ్వరికి ఆశ్చర్యం కలిగించదు. పైగా షర్మిలకు జగన్ వెన్నుపోటు పొడిచాడని ఒక హాస్యాస్పదమైన ప్రకటన చెయ్యగలిగాడంటే జనాన్ని ఆయన ఎంత తక్కువ అంచనా వేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.
ఎన్నివిధాలుగా తన క్షుద్రమీడియాతో జగన్ మీద దుష్ప్రచారం చేయించినా, తన ముఠాతో ఎన్ని దుర్మార్గపు విమర్శలు చేయించినా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద అచంచలమైన విశ్వాసం కనపర్చడం చంద్రబాబుకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. గత ఏడాదిన్నరలో సుమారు నూరు సంక్షేమ పధకాలను మొక్కవోని దీక్షతో అమలు చేయడమే కాకుండా, కరోనా దుర్భర పరిస్థితుల్లో కూడా అయిదుకోట్లమందికి ఏమాత్రం లోటు తెలియకుండా పరిపాలనను నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి సమర్ధత ముందు చంద్రబాబు అసమర్ధులు, అవినీతిపరులు పిపీలికలుగా తేలిపోయారు!
గెలిచినవారిలో సుమారు వెయ్యిమంది తెలుగుదేశం వారే అంటూ పచ్చమీడియా చేస్తున్న ప్రచారం నవ్వులపాలవుతున్నది. అంతేకాకుండా టిడిపి మద్దతుతో గెలిచినవారు వైసిపిలో చేరుతున్నారని పచ్చమీడియా శక్తికొలదీ ప్రచారం చేస్తున్నది. ఎవరెన్ని నిందలు వేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం నడిసముద్రం నిశ్చలంగా ఉన్నట్లు ఎవరి ధూర్తవాక్యాలకు సమాధానం ఇవ్వకుండా నిమ్మళంగా తన పని తాను చేసుకుని పోతున్నారు. ఎంతో ఆశపడి నిమ్మగడ్డను పావుగా వాడుకుని ఏదో సాధించాలని చంద్రబాబు పడిన ఆరాటం బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారింది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు