తోలు తీస్తా: జ‌గ‌న్‌కి ప‌వ‌న్ వార్నింగ్‌

గూండాలు, ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని, అలాంటి పోరాటమే కావాలనుకుంటే సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్ హెచ్చరించాడు. విలువలతో కూడిన రాజకీయం చేయడానికి వచ్చానని,ఎలాంటి భాష వాడాలో తెలిసినవాడినని చెప్పాడు. నేను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలు పెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు ఉహించలేరని,తట్టుకోలేరని, పారిపోతారని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అయితే అలాంటి మాటలతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. బుధవారం భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నాడు జనసేన అధినేత పవన్.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ “చంద్రబాబు జగన్ లాంటివారు రాజ్యాంగం రాయలేరు. అంబెడ్కర్ లాంటి మహానుభావుడికి రాజ్యాంగం రాయగల విజ్ఞానం ఉంటుంది. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్ళకి పిచ్చి పిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే..ప్రజా సంక్షేమం కోసం నిలబడే నాకెంత ఉండాలి. చూడ్డానికే పవన్ కళ్యాణ్ మెత్తగా కనిపిస్తాడు కానీ తేడా వస్తే తోలు తీస్తాడు. సమాజంలో మార్పు తీసుకువస్తున్నాననే భయంతోనే తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ అందరూ నన్ను తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒంటి స్థంభం మేడ మీద కూర్చునే వ్యక్తి కాదు. నేల మీద నడిచే వ్యక్తి అని గుర్తించుకోవాలి.రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోయింది. మరిచిపోయిన మానవత్వం, జవాబుదారీతనాన్ని రాజకీయాల్లో తీసుకురావటానికే జనసేన పార్టీ పెట్టా. రాజకీయాలకు వేళా కోట్లు, గూండాలు అవసరం లేదు. ఆశయం కోసం తెగించే గుణం ఉంటే చాలు. జనసేన అటువంటి ఆశయంతోనే ప్రజా శ్రేయస్సుకు పోరాటం చేస్తుంది అని పవన్ వ్యాఖ్యానించాడు.