వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతల పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు కూడా రఘురామ కృష్ణంరాజుకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇక టిక్కెట్ విషయంలో తనతో ప్రశాంత్ కిషోర్ మాత్రమే మాట్లాడారని, ఆయన తనను బతిమాలితేనే పార్టీలోకి వచ్చానని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రఘురామ కృష్ణంరాజు. దీంతో జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన రఘురామ కృష్ణంరాజు, రాజీనామా చేసి సొంతగా గెలవాలని వైసీపీ నేతలు సవాల్ విసిరారు.
ఈ క్రమంలో వైసీపీ నేతల సవాల్‌కు రియాక్ట్ అయిన రఘురామ కృష్ణంరాజు ప్రతి ఒక్కరు తనను విమర్శించేవారని, ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, అప్పుడు తాను కూడా రాజీనామా చేస్తానని, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళి, ఎవరి బొమ్మ పెట్టుకుని ఎవరు గెలిచారో తేల్చుకుందామన్నారు. తను ముఖ్యమంత్రి జగన్‌ను ఏమనలేదని, తనపై విమర్శలు చేసిన వారిపై మాత్రమే వ్యాఖ్యలు చేశానని, జగన్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
ఇక వైసీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేల కారణంగా జగన్‌కు చెడ్డపేరు వస్తుందని, ముఖ్యంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వల్లనే జగన్‌కు చెడ్డ పేరు వస్తుందని.. కొట్టు సత్యనారాయణ ఒక ఇసుక దొంగ అని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. ఒకవైపు ఇళ్ల స్థలాలతో పాటు మరోవైపు ఇసుక అక్రమాలు చేస్తున్న.. కొట్టు సత్యనారాయణ జాతకం త్వరలోనే బయటపడుతుందని, రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. మరి రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.