ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఆపరేషన్ ఆకర్ష్ బలంగా సాగుతోంది. స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినా ప్రతిపక్ష టీడీపీ నుండి భారీగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీకి కంచుతకోటగా భావించే ముఖ్యమైన ప్రాంతం తిరుపతిలో ఆ పార్టీ ఖాళీ అయిపోతోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సహా ఆ పార్టీ నేతలంతా పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తోంది.
తిరుపతి నియోజక వర్గ టీడీపీ నేతలు కొందరు ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలుగా ఉన్నా వీరంతా.. తమకు తగినంత ప్రాధాన్యత లేదనే అసంతృప్తితో వైకాపా కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే భూమణ కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి టీడీపీ నేతలను వైకాపా వైపు నడిపిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్లను గుర్తించడం, వారిని వైకాపాలో చేర్చే బాధ్యత అంతా ఆయనదే అట. ఇలా చేయడం ద్వారా ఆ ప్రాంతంలో బలమైన నేతలంతా వైకాపాలోకి రావడం, అలాగే భవిష్యత్తులో ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడుతుందనే ఇప్పటి నుండే ఈ బాధ్యతలను తలకెత్తుకున్నట్లు టాక్.
అయితే ఇంత జరుగుతున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబులో చలనం లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. టీడీపీకి చాలా సెంటిమెంట్ ఉన్న ప్రాంతం, ఒకప్పుడు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రాంతం.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే పార్టీ పరిస్థితి ఇంత అద్వాన్నంగా ఉంటే.. ఇక మిగిలిన చోట ఆ పార్టీ మనగలగడం కష్టమే అని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మరి చంద్రబాబు ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకుంటారో లేదో..!