తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంలో రాష్ట్రవాసుల కోటా తగ్గిపోవటం స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా 28 మంది సభ్యులతో ప్రభుత్వం ట్రస్టు బోర్డును నియమించిన విషయం అందరికీ తెలిసిందే. ట్రస్టుబోర్డు సభ్యుల జాబితాను చూస్తే ఏపి నుండి 8 మందిని మాత్రమే నియమించారు. తెలంగాణా నుండి ఏడుగురు నియమితులయ్యారు.
ఇక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు నుండి నలుగురు, కర్నాటక నుండి ముగ్గురు, మహారాష్ట్ర, ఢిల్లీల నుండి చెరో ఒకరిని నియమించింది. ఇక తుడా ఛైర్మన్, స్పెషల్ సిఎస్, దేవాదాయ కమీషనర్, టిటిడి ఈవోలు ఎలాగూ ఉంటారు. మామూలుగా గడచిన ప్రభుత్వాలేవీ ఇంత భారీ స్ధాయిలో సభ్యులను నియమించింది లేదు.
ట్రస్టుబోర్డులో సభ్యత్వం అంటే స్టేటస్ సింబల్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రులుగా ఎవరున్నా రాజకీయ ఒత్తిళ్ళు పెరిగిపోయిన మాట వాస్తవం. అయినా సరే మొన్నటి వరకూ మహా అయితే ఏ 15 మందో లేకపోతే 19 మంది మాత్రమే సభ్యులుగా ఉండేవారు. వీరిలో కూడా తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల నుండి మహా అయితే ఒక్కోరిని మాత్రమే తీసుకునే వారు.
చంద్రబాబు హయాంలో తెలంగాణా నుండి ఇద్దరు నియమితులయ్యారు. మిగిలిన వాళ్ళంతా రాష్ట్రానికి చెందిన ఎంఎల్ఏలు, నేతలే ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏపి నుండి 8 మందిని మాత్రమే నియమించి తెలంగాణా నుండి ఏకంగా ఏడుగురిని నియమించటమే ఆశ్చర్యంగా ఉంది.