ఇపుడిదే ప్రశ్న తెలుగుదేశంపార్టీలో మొదలైంది. రాబోయే డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రకటన రావటం ఆలస్యం చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసిపి చేతిలో తిన్న చావుదెబ్బ నుండి చంద్రబాబు ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మున్సిపల్ ఎన్నికలంటే టిడిపి సత్తా చాటటం కష్టమనే చెప్పాలి.
జగన్మోహన్ రెడ్డి మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేసిన సంగతి అందరూ చూస్తున్నది. పాదయాత్రలోను, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు జగన్ శ్రీకారం చుట్టారు. చాలా పథకాల అమలుకు షెడ్యూల్ ను కూడా ప్రకటించేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఇచ్చిన హామీల అమలుపై జగన్ దృష్టి పెట్టటంతో జనాలు హ్యాపీగా ఉన్నారు.
జగన్ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టలేదనే చెప్పాలి. రాష్ట్ర ఖజనా ఖాళీగా ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాలను మెల్లిగా చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ముందుగా ఖజానాకు నాలుగు డబ్బులు వస్తే అప్పుడు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా టేకప్ చేయాలన్నది జగన్ ఆలోచన.
నూరు రోజుల పాలనలో జగన్ పాలనపై జనాలు సానుకూలంగా ఉండటం చంద్రబాబుకు సహజంగానే ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అందుకనే జగన్ పై వ్యతిరేకత పెంచటానికి చంద్రబాబు ఎంత అవస్తలు పడుతున్నా సాధ్యం కావటం లేదు. అదే సమయంలో చాలామంది టిడిపి నేతలు వైసిపిలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్ధితుల్లో మున్సిపల్ ఎన్నికలంటే చంద్రబాబుకు కష్టమనే చెప్పాలి.