టిటిడిపై సుబ్రమణ్యస్వామి పిటిషన్ వేస్తారా? లేదా?

బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి టిటిడి వివాదాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేయబోతున్నానని నెల రోజులుగా చెబుతున్నారు. కానీ స్పష్టంగా ఏ తేదిన పిటిషన్ వేస్తారనేది ప్రకటించడం లేదు. జూన్‌లో మాట్లాడుతూ జూలై 19 న వేస్తాననన్నారు. తాజాగా సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ టిటిడిపై పిటిషన్ వేస్తానన్నారే కానీ మళ్లీ స్పష్టంగా వేస్తారో లేదో చెప్పలేదు. సుబ్రమణ్యస్వామి ఓ ఆర్థికవేత్త, న్యాయవాది ఆయనకు పిటిషన్ తయారు చేయడానికి ఇంత సమయం పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్రమణ్యస్వామి కావాలనే ఆలస్యం చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. పిటిషన్ అంశం తెరపైకి తెచ్చి ఏపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే భావనలో ఆయన ఉన్నారా లేక ఇదంతా డ్రామాగా చేస్తున్నారా అనే చర్చ నడుస్తోంది.

సుబ్రమణ్యస్వామి దివంగత సీఎం జయలలితపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. యూపిఏ హయాంలో బొగ్గు కుంభకోణాలు జరిగాయని కేసులు పెట్టారు. దానిపై  ఇప్పటికి కూడా కాంగ్రెస్  నేతలు విచారణను ఎదుర్కొంటున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికపై  కేసును కూడా సుబ్రమణ్య స్వామినే వేశారు. చివరికి ఆ పత్రికే మూతబడింది.

ఇటివల తిరుమలలో శ్రీవారి ఆభరణాల విషయంలో చాలా పెద్ద గొడవే నడిచింది. స్వామివారి ఆభరణాలు మాయమయ్యాయని వాటిపై విచారణ జరిపించాలని వివాదాలు చెలరేగాయి. అర్చకుల వివాదం కూడా టిటిడిని కలవరపెట్టింది. శ్రీవారి ఆభరణాలను ప్రభుత్వమే మాయం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో తాను టిటిడిపై కేసు వేస్తానని అప్పుడే సుబ్రమణ్య స్వామి చెప్పారు. టిటిడిపై తాను త్వరలోనే పిటిషన్ వేయబోతున్నట్టు సుబ్రమణ్య స్వామి తెలిపారు. దీంతో ఆయన వేసిన ఏ కేసైనా నాయకులను ఇరుకునపెట్టింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇరుకున పడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.