కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో వైపు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా అంతా ఏకమై కరోనాపై యుద్దం చేయాల్సింది పోయి ఇక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారని అధికార పక్షం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లను ఉపయోగించి రేషన్ అందజేత, అలాగే విదేశాల నుండి వచ్చిన వారి సమాచార సేకరణ, కరోనాపై అవగాహనా కార్యక్రమాలు ఇలా అనేక పనులను వారికి అప్పజెప్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
దీనిపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షా సమయంలో గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పని చేయలేక పోతున్నారు అని అన్నారు. వారు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలి అని సూచించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఆయనే బాధ్యతగల విపక్షంగా రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, ప్రభుత్వానికి సహకరిస్తామని కూడా అన్నారు. అయితే పవన్ మొదటి మాటనే పట్టుకున్నారేమో జన సైనికులు.. ఆ పార్టీకి సంబంధించిన మీడియా వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉండటం గమనార్హం.
మున్ముందు రాష్ట్రం మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు.. ఇలాంటి తరుణంలో ఇలా విపక్షాలు విమర్శలు చేయడంపై అధికారపక్షం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారికి జనసేన కూడా తోడు అన్నట్లు కాకుండా.. బాధ్యతగల విపక్షంగా పనిచేయాలని అధికార పక్షం కోరుతోంది. మరి ఇప్పటికైనా అన్ని పార్టీలు రాజకీయాలు మరిచి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తారేమో చూడాలి.