శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యకు జగన్మోహన్ రెడ్డి శాస్వత పరిష్కారం చూస్తున్నారు. కిడ్నీ బాధితుల సమస్యలకు కలుషిత నీరు తాగటమే అని నిపుణులు ఇప్పటికే ప్రకటించారు. అందుకనే బాధిత ప్రాంతాలన్నింటికీ శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.
పరిశుద్ధమైన నీటి సరఫరా కోసం మూడు వాటర్ గ్రిడ్లను ఏర్పాటు చేయాలని అధికారులతో చెప్పారు. అంటే వాటర్ గ్రిడ్లు రాష్ట్రంలోని దాదపు అన్నీ ప్రాంతాలను కవర్ చేస్తాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ బాధిత ప్రాంతాలన్నింటికీ ప్రత్యేకంగా మంచినీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచినీటి సరఫరా కోసం జిల్లాలోని రేగులపాడు దగ్గర రిజర్వాయర్ నిర్మిచాలని చెప్పారు. ఇక్కడి నుండి ప్రధానంగా పలాస, కాశీబుగ్గ ఇచ్చాపురం ప్రాంతాల్లో నీటి సరఫరాను నేరుగా కొళాయిల ద్వారా బాధితుల ఇళ్ళకే సరఫరా చేయాలన్నది జగన్ ఆలోచన. ఇందుకోసం రూ. 600 కోట్లు ఖర్చవుతుందని కూడా లేక్క తేలింది.
ఇక మూడు వాటర్ గ్రిడ్ల ద్వారా మొదటిదశలో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాలకు నీరందుతుంది. రెండోదశలో విజయనగరం, విశాఖపట్నంతో పాటు రాయలసీమ జిల్లాలున్నాయి. మూడోదశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు నీరందుతుంది. రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలోనే కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దశాబ్దాలుగా ఏ సిఎం కూడా వీళ్ళ సమస్యకు శాస్వత పరిష్కారం చూడలేదు. ఆపని ఇపుడు జగన్ మొదలుపెట్టారు.