జగన్‌ కు బాలయ్య విజ్ఞప్తి.. అదేమిటంటే?

ఏపీ సీఎం జగన్‌కు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ కొత్త విజ్ఞప్తి చేశాడు. ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతునట్టు ప్రకటించినా ఇప్పటి వరకు ఆ కార్యక్రమం రూపుదాల్చలేదు. అయితే తాజాగా వైసీపీ సర్కార్ జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు మొదలుపెట్టిందని, జూలై 15న జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

అయితే జిల్లాల పునర్విభజన జరిగితే హిందూపురంను కూడా జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ తాజాగా బాలయ్య బాబు సీఎం జగన్‌కి లేఖ రాశారు. దీంతో పాటు హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరయ్యిందని అయితే ఆ కాలేజీని హిందూపూర్ సమీపంలోని మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదిలా ఉంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేయాలని ప్రభుత్వం తొలుత భావించినా, పార్లమెంట్ నియోజకవర్గాలుగా జిల్లాలను విభజిస్తే సమస్యలు వస్తాయని అధికార పార్టీ నేతలే అంటుండడంతో దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు కాస్త ఆసక్తిగా మారింది.