ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. మొత్తం 175 ఎమ్మెల్యేల్లో 173 ఓట్లు పోల్ అవగా.. అందులో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, .జనసేన నుండి ఒక ఎమ్మెల్యే, టీడీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది ఓట్లు వేశారు. ఇక ఏసీబీ కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు, మరోవైపు హోమ్ క్వారంటైన్లో ఉన్న అనగాని సత్యప్రసాద్‌లు ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు.
ఇక వైసీపీకి మొత్తం 151 ఓట్లు పడగా, టీడీపీకి మాత్రం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో 4 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. రెబల్స్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని.. ఈ నలుగురు ఎమ్మెల్యేలు చెల్లిని ఓట్లు వేశారు. మొదటి ప్రాధాన్యత వద్ద వన్ అని నంబర్ వేయకుండా టిక్ మార్క్ పెట్టడంతో ఈ నలుగురి ఓట్లు చెల్లలేదు. వీరంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, నిబంధనల ప్రకారం వేయకపోవడంతో వారి ఓట్లు చెల్లకుండా పోయాయి.
అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. రెబల్స్ ఎమ్మెల్యేల పై టీడీపీ విప్ జారీ చేసిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే, వీరంతా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చర్చించుకుంటున్నారు. అయితే అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కూడా నిబంధనలు ప్రకారం ఓటు వేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజులుగా ఆమె టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉంది. దీంతో ఆదిరెడ్డి భవాని కావాలనే ఇలా చేశారని టీడీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు వారసురాలిగా పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి భవానికి ప్రస్తుతం టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం, మరోవైపు టీడీపీ నావ పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉన్న నేపధ్యంలో ఆమె త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చేప్పేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.