ఆంధ్రప్రదేశ్లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. రాష్ట్రంలో కరోనా కలకలం మొదలైనప్పటి నుండి.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉపకరణాలకు సంబంధించి ఇప్పుడు మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్నిటా టెండర్ల పారదర్శకత అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం వందల కోట్ల విలువైన వస్తువుల కొనుగోలులో మాత్రం ప్రాథమిక నిబంధనలను కూడా పాటించలేదన్న వాస్తవాలు బైటికి వస్తున్నాయి.
కరోనాకు సంబంధించి.. ఏపీఎమ్ఎస్ఐడీసీ సుమారు రూ.500 కోట్ల విలువైన వివిధ ఉపకరణాలను కొనుగోలు చేసింది. వీటిలో సుమారు రూ.260 కోట్ల విలువైన సర్జికల్ ఐటమ్స్, మందులు, రూ.220 కోట్ల విలువైన వైద్య సామాగ్రి ఆర్డర్లు ఉన్నాయి. ఆర్డర్లు ఇచ్చారు గానీ వీటిలో ఎక్కడా బేసిక్ నిబంధనలను కూడా పాటించలేదని వినిపిస్తోంది.
అయితే కరోనాకు సంబంధించిన ఉపకరణాల కొనుగోలుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయన్నది తెలిసిందే. అది అవసరం కూడా. అయితే ఆయా రాష్ట్రాలు నిబంధనలమే ప్రకారమే వెళ్తూ.. షార్ట్ టెర్మ్ టెండర్లు ఇస్తూ.. కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేస్తున్నాయి.
కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు భిన్నంగా.. ముందుగా ఉన్న నిబంధనలు గాలికి వదిలేసి.. ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ నుండి ఎలాంటి నిబంధనలు లేకుండానే కొనుగోలు చేస్తున్నారట. ముఖ్యంగా, మాస్కులు, శానిటైజర్లు వంటివి అయితే బహిరంగ మార్కెట్లో రూ.2, 3 రూపాయలుగా ఉన్నవి కూడా రూ.8 పెట్టి కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ వ్యవహారం కూడా ముదరక ముందే వీటిపై ప్రభుత్వ అధికారులు క్లారిటీ ఇస్తే బాగుంటుంది.