“ఆత్మ వంచన – పరనింద”
ఈ శీర్షిక మొత్తం రచయితకు కూడా వర్తిస్తుంది కదా!
అయినా గడచిన 8 నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై కాకుండా ఇతర విషయాలపై “పలుకు” ఒక్క వారం అయినా వచ్చిందా? ఏమో నాకు గుర్తు లేదు.
ఒకటి రెండు సందర్భాల్లో తెలంగాణ రాజకీయాలపై రాసినా అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై “ఆత్మ వంచన, పరనింద” స్పష్టంగా కనిపించలేదూ!?
ఇలా వారాల తరబడి, కాలాలకు కాలాలు, పేజీలకు పేజీలు ఏకపక్ష వార్తలతో విశ్వసనీయత కోల్పోవడంతో పాటు ఒకవర్గం పక్షపాతం ప్రదర్శిస్తున్నట్టు లేదూ?.
ఈ రకం వర్గ, పార్టీ పల్లకీ మోతతో ఇక్కడ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత “ఫీల్” అయ్యే కొన్నిఇతర వర్గాల్లో ఆ వ్యతిరేకత అణిగిపోతున్నట్టు లేదూ?. ఈ రకం పల్లకీ మోత ఇతర వర్గాలను సమస్యలనుండి దూరం చేస్తున్నట్టు అనిపించడం లేదా?.
ఒక పార్టీ, ఒక సమస్య, ఒకే మూస వ్యతిరేకత… ఇవన్నీ కలిపి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రతను తగ్గించేస్తున్నాయి అనిపించడం లేదా?. ఇవి ఒక వర్గం సమస్యలే అనే భావం నెమ్మదిగా ప్రజల్లో బలపడుతోంది అనిపించడం లేదా?. ఆ దృశ్యం రాష్ట్రంలో కనిపించడం లేదా?
ఒకటి, రెండు గొంతులు మినహా ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత వినిపిస్తున్న మొత్తం గొంతుల్లో, పత్రికల్లో కనిపించే అక్షర సమాహారం, వార్తా ఛానళ్ళలో వినిపించే కధనాల స్వరం, చూపించే దృశ్యం, గంపగుత్తగా ఒకే “సామాజిక” కోణంలోనే ఉన్నట్టు బోధపడడం లేదా?
మిగతా సామాజిక వర్గాలు ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేసే అవకాశాన్ని, విమర్శించే హక్కుని “ఓన్” చేసుకునేందుకు తటపటాయిస్తున్న విషయం ఈ ఏకపక్ష ధోరణికి స్ఫురించడం లేదా?
మీడియాపై కర్రపెత్తనం ఉత్తర్వులను, సచివాలయం (Executive), శాసనసభ (Legislature) విడగొట్టడం వంటి నిర్ణయాలను నిరసించే నాబోటి చిన్నా, చితకా మనుషులు కూడా రాష్ట్రంలో, దేశంలో ఏ సమస్యలూ లేనట్టు “ఆత్మ వంచన (ఆత్మ స్థుతి) పరనింద” పనిగట్టుకొని రాష్ట్ర ప్రజలందరికీ అంటగట్టే ప్రయత్నం చేస్తున్న తీరు చూసి కాస్త పునరాలోచనలో పడాల్సి వస్తోంది కదా!?
ప్రజాస్వామ్య వాదులు ప్రభుత్వ నిర్ణయాలపై, వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేయడానికి వెనుకాడరు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారూ, ప్రభుత్వ నిర్ణయాలవల్ల నష్టపోతున్న వారూ నిరసన వ్యక్తం చేస్తారు. విమర్శలు చేస్తారు. ఇలా సహజంగా రావాల్సిన వ్యతిరేకతను ఈ “గంపగుత్త స్వయంసృష్టిత వ్యతిరేకత” (self-manufactured wholesale opposition) వెనుకంజ వేయించడం లేదూ?
అధికార పీఠంపై కూర్చుని 8 నెలలు పూర్తయి తొమ్మిదో నెల గడుస్తున్నా సంక్షేమ ఫథకాలు మినహా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మొదలు పెట్టని ఈ ప్రభుత్వంపై లేవాల్సిన గొంతులు ఈ ధోరణితో వెనకడుగు వేస్తున్న విషయం అర్ధం కావడం లేదా?
ఈ గోల ఆపేసి ఇతర వర్గాలు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చే ప్రజాస్వామ్య స్పృహ కలగడం లేదా?
కార్తీకమాసంలో జరిగే “వనసమారాధనలు” దురదృష్టవశత్తూ “కులసమారాధనలు”గా మారిపోయినట్టు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతు “సామాజిక గొంతు”గా మారిపోయిందేమిటి? లోపం ఎక్కడుంది? బాధ్యత ఎవరిది? సరిదిద్దాల్సింది ఎవరు? అసలు సరిదిద్దాల్సిన అవసరం ఉందా? లేదా?