ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకానికి శ్రీకారం చుట్టగా తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు నాయుడు అదే రోజు కుప్పంలో ప్రజా చైతన్య యాత్ర మొదలైనది. యధా ప్రకారం చంద్రబాబు నాయుడు సభలకు జనం పోటెత్తారు. మంగళవారం కూడా తన స్వంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని ఆయన పర్యటనను అడ్డుకొనేందుకు వైకాపా శ్రేణులు సమాయత్తమైనవి. పులివెందులకు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుప్పంకు చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదనే వాదన కేవలం రాజకీయ పరమైన ఆరోపణే అవుతుంది.
వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్త పర్చేందుకు చంద్రబాబు నాయుడు తన పర్యటనను ఉపయోగించుకుంటున్నారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి నేతలు కార్యకర్తలతో సమావేశమవుతున్నారు.1989 నుండి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. వాస్తవంలో కుప్పం నియోజకవర్గంలో వచ్చే మెజారిటీ మాత్రమే చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి గెలుపును నిర్దేశించేది. కాగా మెజారిటీకి గీటురాయిగా పుంగనూరు పలమనేరు నియోజకవర్గాలు వుండేటివి. 2014 ఎన్నికల్లో పలమనేరు పుంగనూరు నియోజకవర్గాలు టిడిపి నుండి చేజారినా చిత్తూరు నుండి కుప్పం మెజారిటీతో టిడిపి అభ్యర్థి డాక్టర్ శివప్రసాద్ గెలుపొందారు. 2019 వచ్చే సరికి ఓడలు బండ్లు అయ్యాయి బండ్లు ఓడలు అయ్యాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటనకు వైసిపి శ్రేణులు కొంత అడ్డంకి కల్పించినా సోమవారం చంద్రబాబు నాయుడు పర్యటనకు జనం బాగా వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా తన ప్రసంగాల్లో మరింత కరకుదనం దట్టించారు. ఇప్పటికీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు తిరుగు వుండదు. ఎందుకంటే అధునాతన వ్యవసాయ పద్ధతులు ప్రవేశ పెట్టి రైతుల ఆదాయం బాగా పెంచగలిగారు. పూలు పళ్లు కూరగాయల పండించడంలో చంద్రబాబు నాయుడు కృషి ఎంతో వుంది. కుప్పం పూర్తిగా వాణిజ్య పంటల సాగుకు చంద్రబాబు నాయుడు అనువైన వాతావరణం కల్పించారు. 2019లో రాష్ట్రం మొత్తం మీద వీచిన గాలి కుప్పం ను తాకింది. మెజారిటీ తగ్గింది తప్ప మరొకటి కాదు. 2004 ఎన్నికల మునుపు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ప్రప్రథమంగా కుప్పం నియోజకవర్గంలోనే ప్రకటించారు. 2004 ఎన్నికల్లో టిడిపి ఓడిపోగా అధునాతన ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతులు ఆచరించడంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఇప్పటిలాగే విచారణలు జరిగాయి. కానీ తుదకు ఏమీ దొరకలేదు. చంద్రబాబు నాయుడు వ్యవహార సరళి ఎరిగిన వారు అవినీతి కేసుల్లో చిక్కుపడతాడని ఏ మాత్రం ఊహించ లేరు.
కుప్పం టవున్ లో ప్లైక్సీలు టిడిపి నేతలు ఏర్పాట్లు చేసేందుకు అవకాశం లేకుండా వైసిపి వాళ్ళు ఏర్పాటు చేసినందున వివాదం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు టిడిపి జెండా ఆవిష్కరణ చేసేందుకు వెళ్లగా తగాదా ఏర్పడింది కాని నియోజకవర్గంలో జన సామాన్యంలో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట ప్రాబల్యం ఈ నాటికి ఏమాత్రం తగ్గలేదని సోమవారం ఆయన సభలకు వచ్చిన జనమే నిదర్శనం.