పవన్ బాబుకి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊపిరి పోసిందట, ప్రజాస్వామ్య ప్రక్రియ పై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసిందట. చెప్పమంటే సినిమా డైలాగ్ లు ఎన్నైనా చెబుతాడు మన పవన్ కళ్యాణ్. సరే, ఇంతకీ అసలు మ్యాటర్ లోకి పోతే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే ఓ ట్వీట్ చేస్తూ.. ‘ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది, అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది’ అంటూ పోస్ట్ చేశారు.
నిజానికి గతంలోనే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విధులు నుండి తొలగించడం పై పవన్ కళ్యాణ్ సాబ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేశంగా నాలుగైదు ట్వీట్స్ కూడా చేశారు. కక్ష సాధింపు, మొండి వైఖరి, ఏక పక్ష నిర్ణయాలతో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి వ్యవహరించిందని, కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎన్ని ప్రాణాలు పోయేవో చెప్పగలరా అంటూ పాపం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తెగ ప్రశ్నించేశారు.
కాకపోతే జవాబులు చెప్పేవాళ్ళే ఇంతవరకూ ఎవరూ దొరకలేదు. అయినా జవాబులు మన పవన్ సాబ్ కి అనవసరం. ఆయన ఓన్లీ ప్రశ్నించుకుంటూ పోతారు అంతే. అవి మనము వింటూ ఉండాలి అన్నమాట. మరి ఆ ప్రశ్నలకు అంతు ఎప్పుడో పవన్ బాబుకే తెలియాలి. అన్నట్టు ఈ మధ్య మన పవన్ బాబు సెంటిమెంట్ డైలాగ్ లు కూడా చెబుతున్నాడండోయ్. జన సైనికులు తెగ ప్రజా సేవ చేస్తుంటే.. సేవ చేయనివ్వకుండా వారి పై వైసీపీ మనుసులు దాడులు చేస్తున్నారట. ఏంటో ఈ పవన్ కళ్యాణ్ పాపం.