ఎగిరెగిరిపడిన వైకాపా ఎమ్మెల్యేపై కేసు 

ప్రజానీకానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఒక్కోసారి విజ్ఞత మర్చిపోయి వ్యవహరిస్తుంటారు.  క్షణికావేశంలో తమ పవర్, పలుకుబడి చూపబోయి చిక్కుల్లో పడుతుంటారు.  అలాంటి పరిస్థితే వచ్చింది అధికార పార్టీ ఎమ్మెల్యే అప్పలరాజుకు ఎదురైంది.  పలాస ఎమ్మెల్యే అయిన అప్పలరాజు బంధువులు లాక్ డౌన్ ముందు ఒడిశాకు ఒక వివాహ వేడుకకు వెళ్లారు.  ఇంతలో లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే ఉన్న వారంతా ఎమ్మెల్యే అప్పలరాజు భరోసాతో సొంత ఊరికి బయలుదేరారు. 
 
మొత్తం 26 మందితో కూడిన ఆ బస్సు నిన్న పట్టుపురం చెక్ పోస్ట్ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు.  ఇంతలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారు.  అధికారులు అనుమతులు లేవన్నా వినకుండా గంటపాటు రోడ్డు మీదే హడావుడి చేశారు.  చివరికి బారికేడ్లను తోసేసి మరీ అందరినీ లోనికి తీసుకొచ్చారు.  దీంతో పోలీసులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి పిర్యాదు చేశారు.  
 
రాష్ట్రంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి కావడంతో అధికారులు ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  అలాంటి చోట ఎమ్మెల్యే నిబంధనలు అతిక్రమించడంతో ఉన్నతాధికారులు బాగా సీరియస్ అయ్యారు.  సదరు ఎమ్మెల్యేతో పాటు ఇంకో 9 మందిపై లాక్ డౌన్ ఉల్లంఘన కేసు నమోదు చేసి బస్సులో వచ్చిన వారందరనీ క్వారంటైన్ సెంటర్లకు తరలించారు.