తెలంగాణాలో జరగబోయే హుజూర్ నగర్ ఉపఎన్నికలో జగన్మోహన్ రెడ్డే కీలకంగా మారబోతున్నారా ? వినటానికి నమ్మకంగా లేకపోయినా ఇదే వాస్తవమట. తొందరలోనే నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఏకైక ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో అన్నీ పార్టీలు వేటికవి వ్యూహ రచన చేసుకుంటున్నాయి.
మొన్నటి ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిగా గెలవటంతో ఎంఎల్ఏగా రాజీనామా చేశారు. దాంతో ఇక్కడ ఉపఎన్నిక అవసరం అయ్యింది. ఎలాగూ సీటు కాంగ్రెస్ దే కాబట్టి మళ్ళీ గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ నేతలున్నారు. అందుకనే ఉత్తమ్ సీనియర్లందరినీ కలిసి మద్దతు కోరుతున్నారు. ప్రస్తుత పరిస్ధితిలో వేరే దారి లేదు కాబట్టి అందరూ ఉత్తమ్ భార్య పద్మావతి గెలుపుకు కష్టపడతారనే అనుకుంటున్నారు.
ఇక నాలుగు ఎంపి సీట్ల గెలుపుతో బిజెపి కూడా మంచి ఊపుమీదుంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటూ ఊగిపోతున్న బిజెపి నేతలు హుజూర్ నగర్ ఉపఎన్నికలో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కాబట్టి గెలుపు కోసం చివరి వరకూ బిజెపి పోరాడుతుందని చెప్పక తప్పదు.
అదే సమయంలో తనపై ఎటువంటి ప్రజావ్యతిరేకత లేదని చెప్పుకునేందుకు కెసియార్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుపు మీద ఆత్మవిశ్వాసంతో దూసుకెళుతున్నారు. అంటే మూడు పార్టీలు కూడా గెలుపుకోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే హుజూర్ నగర్ ఉపఎన్నికలో వైసిపిని పోటి పెట్టమని కెసియార్ చెప్పారట. వైసిపి పోటిలో ఉంటే కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు చిల్లుపడుతుందని కెసియార్ ఆలోచన కావచ్చు. మరి జగన్ ఏం చేస్తారో చూడాల్సిందే.