ఆంధ్రాలో టీడీపీ పొత్తు ఆ పార్టీతోనేనా?

ఏపీలో టీడీపీ కొత్త రాజకీయ పొత్తులకు తెరలేపనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏపీలో టీడీపీకి మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సహకారం లేనిదే ముందడుగు వేయలేమనే డైలమాలో టీడీపీ పడింది. అందుకే కలిసి వచ్చే ఏ పార్టీతోనైనా జత కట్టేందుకు టీడీపీ సిద్దమైంది. కానీ ఇప్పటికే ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. అన్ని పార్టీలు 2019 ఎన్నికల్లో పొత్తులపై ఒక అభిప్రాయంతో ఉన్నాయి. మరీ అధికార టీడీపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోనుంది అనే చర్చ అందరిలో సాగుతుంది.

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా హాట్‌గా సాగుతున్నాయి. ఎన్నికలకు పది నెలల సమయం ఉండగానే పార్టీలన్నీ పొత్తులపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించినా ఈ రెండు పార్టీల మధ్య లోపాయికర ఒప్పందం నడుస్తుందన్న చర్చ జరుగుతుంది. వామపక్షాలు జనసేనతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇక మిగిలింది కాంగ్రెస్, టీడీపీనే. 2014 వరకు కాంగ్రెస్ ఏపీలో ఎదురులేని పార్టీగా ఉన్నది. 2014లో తెలంగాణను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో జవసత్వాలను కోల్పోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సాధించుకోలేక పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పడవలాగా ఏపీలో తయారైంది. ఆ తర్వాత ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎడమొహం పెడమొహంలా ఉండే టీడీపీ చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై పడింది.

వచ్చే ఎన్నికల్లో మిగిలిన పార్టీలను ఓడించి మళ్లీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ తో పొత్తు తప్పనిసరి అని టీడీపీ భావిస్తుంది. ఈ పొత్తు అంశం పై ఇప్పటికే ఇరు పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోకి దిగి సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలంటే సమయం పట్టే అవకాశం ఉన్నందున టీడీపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లటం మంచిదనే భావనలో కాంగ్రెస్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం . టీడీపీతో పొత్తు పెట్టుకుంటే 25 అసెంబ్లీ స్థానాలనైనా గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ కు 20-25 అసెంబ్లీ స్థానాలను కేటాయించేందుకు టీడీపీ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే నిజంగా ఇది చరిత్రాత్మకమే అని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ, కాంగ్రెస్ కలిసి నడిచిన దాఖలాలు లేవు. టీడీపీ.. బీజీపీ, వామపక్షాలతో జతకట్టింది కానీ కాంగ్రెస్ తో కలిసి పనిచేయలేదు. కానీ చంద్రబాబు రాజకీయ అవసరం కోసం ఎటువంటి నిర్ణయమైనా తీసుకోగలడు. ఇటీవల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా కాంగ్రెస్ తో కలిసి నడవాలని సూచిస్తూ చంద్రబాబుకు లేఖ రాసింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన రాహుల్, చంద్రబాబులు కలిసి ఏకాంతంగా మాట్లాడుకోవడం కూడా ఈ రెండు పార్టీలు కలవనున్నాయనే అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

దీంతో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అన్ని విబేధాలను పక్కకు పెట్టి పొత్తు ద్వారా కలిసి ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు బలంగా ఎదగాలనే కాంక్షతో ఉన్నాయి. ఇప్పటికే హీటెక్కిన ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయో చూడాలి. టీడీపీ, బీజేపీల పొత్తు నిజమేనా..?అది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో అన్న చర్చ ఏపీ రాజకీయాలలో జోరుగా సాగుతుంది. పొత్తులను జత కట్టడంలో దిట్ట అయిన చంద్రబాబు ఎటువంటి ఎత్తుగడ వేయనున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.