అటో మద్దెల, ఇటో మద్దెల.. మధ్యలో బాబు

( టి.రమేశ్ బాబు)

చంద్రబాబు ఏం చేసినా, చేయకపోయినా రాజకీయ ప్రయోజనమే కీలకంగా ఉంటుందన్నది తెలుగు జగమెరిగిన సత్యం. కొన్ని నెలల క్రితం బీజేపీకి గుడ్ బై చెప్పి ఎన్డీయే నుంచి బయటికొచ్చిన బాబు… వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఏపీలో బీజేపీ వ్యతిరేకతే ఆధారంగా తన బేస్ ను సుస్థిరం చేసుకునేందుకు నూటొక్క మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో ఒకటి.. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్ష అనే డ్రామా. తెలంగాణ బయ్యారంతో పాటు ఆంధ్రా కడపలో ఉన్న ఉక్కు నిల్వలు నాసిరకమైనవేనంటూ విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీలు నెలకొల్పడం కుదరదని చెప్పింది. విచిత్రంగా తెలంగాణ సర్కారు కేంద్రాన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా… ఏపీ పెద్దలు మాత్రం బీజేపీ వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోస్తూ కడపలో నిరాహార దీక్ష అంటూ టెంటేసుకొని కూర్చున్నారు. సాటి తెలుగు సర్కారు కేంద్రాన్ని మెప్పించేందుకు సానుకూల మార్గాన్ని ఎంచుకోగా… 40 ఏళ్ల రాజకీయ చాణక్యం గల చంద్రబాబు మోడీ మీద తొడ గొడుతున్నట్టు పోజులిస్తూ ఫక్తు రాజకీయ ప్రయోజనమే లక్ష్యంగా డ్రామాలకు తెర లేపారని ఎవరికైనా అర్థమవుతుంది.

విశాఖ రైల్వే జోన్ కోసం ఉద్యమం

అధికారంలో ఉన్న పార్టీ నడిబజారులో దీక్షకు దిగడాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? నిలువెత్తు వైఫల్యాన్ని కవర్ చేసుకుంటూ కేంద్రానిదే బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తే.. అందులోని అసలు మర్మాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులా ఆంధ్రా ప్రజలు? అసలు ఉత్తరాంధ్రకు రావాల్సిన రైల్వే  జోన్ గురించి ఎప్పుడూ మాట్లాడని ఏపీ పెద్దలు… ఒక్క కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే… కడప జిల్లా వైసీపీకి పట్టున్న జిల్లా. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు మినహా అన్ని స్థానాలు కూడా వైసీపీ గెలుచుకున్నవే. అదే టికెట్ మీద గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీకి వెళ్లి మంత్రవడం వేరే విషయం. జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. గత నవంబర్లో మొదలైన ప్రజాసంకల్పయాత్రకు జగన్ వెంట జనం పోటెత్తడం బాబు కళ్ల ముందు మెదుల్తూనే ఉంటుంది. కాబట్టి సొంత జిల్లాకు రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని జగన్ గాలికొదిలేసి అక్కడెక్కడో పాదయాత్ర చేస్తున్నాడన్న ఫీలింగ్ కలిగించడం, బీజేపీకి ఆంధ్రా ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి లేదని కలరింగ్ ఇవ్వడం, వదులవుతున్న టీడీపీ పునాదులను పటిష్టం చేసుకునేందుకు యత్నించడం… ఇంతకన్నా వేరే ప్రయోజనాలేవీ బాబుకు ముఖ్యం కాదు. కేంద్రం నుంచి ఖరారుగా రావాల్సిన రైల్వే జోన్ ను పట్టించుకోని చంద్రబాబు కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం చిత్తశుద్ధి ప్రదర్శిస్తారంటే నమ్మేదెవరు?  ఇది చిత్తశుద్ధితో చేస్తున్నది కాదు. ఎందుకంటే ఆయన విశాఖరైల్వే జోన్ డిమాండ్ ను ఎపుడో వదిలేశారు. ఉక్కులాగా ఆయన విశాఖ  జోన్ గురించి ఉద్యమం చేయించడం లేదు. అంతేకాదు, ఆ మధ్య జోన్ విషయంలో  టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేశాడని పిల్చి చివాట్లు పెటాడని చెబుతారు. ఇపుడే మే రాయలసీమలో ప్రజలను ఆకట్టుకోవడానికి, అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేస్తున్న విద్యార్థల ఉాద్యమాన్ని హైజక్ చేసుకుపోయేందుకు ఇపుడు కడప ఉక్కు ఉద్యమం ఎత్తుకున్నాడని అందరికి తెలిసిపోయింది.

కడప స్టీల్ కోసం టిడిపి ఉద్యమం

విశాఖ రైల్వే జోన్ ఊసెత్తకుండా చేశారని ఉత్తరాంధ్రలో బాగా వ్యతిరేకత ఉంది.  కేంద్ర బడ్జెట్ సమయంలో మిత్రధర్మాన్ని అనుసరించి రైల్వే జోన్ పై మాట్లాడకుండా విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు కడపలో దీక్షలు చేయించినా అవే విమర్శలు ఎదుర్కోవాల్సిన  రావడం  ప్రతిదానిని రాజకీయాలకు వాడుకోవాలనే ఆయన ‘రాజకీయం’ పర్యవసానమే. మొత్తానికి ఆయనిపుడు రెండింటి మధ్య ఇరుక్కుపోయినట్లే లెక్క.