కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో.. ఇంకా ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ ఒక్కో సందర్భాల్లో బంధాలకు పరీక్షగా నిలిచింది. తండ్రి, తల్లి, భార్య, భర్త ఇలా ఎవ్వరు చనిపోయినా సరే శవాన్ని కూడా పట్టించుకోలేదు. కరోనా వల్ల వచ్చిన చావు కూడా ఎంతో భయంకరంగా ఉండేది. ఇక కరోనా సోకిందంటే సమాజంలో చీడ పురుగును చూసినట్టు చూసేవారు. కరోనా వైరస్ అలా చంపుతూ ఉంటే సమాజం మరోలా చంపేస్తూ వచ్చింది.
తన జీవితంలో జరిగిన సంఘటనను రవికృష్ణ తాజాగా చెప్పుకొచ్చాడు. రవికృష్ణ, శివజ్యోతి ఇలా అందరూ స్టార్ మా దసరా ఈవెంట్లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. జాతరో జాతర అనే ఈ ఈవెంట్లో రవికృష్ణ, నవ్యస్వామి ఎమోషనల్ పర్ఫామెన్స్ చేశారు. ఆమె కథ సెట్‌లోనే ఈ ఇద్దరికీ కరోనా సోకిన సంగతి తెలిసిందే. మొదటగా నవ్య స్వామికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆపై రవికృష్ణకు పాజిటివ్ అని తేలింది.
కరోనా వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో వారికి తెలుసు. కరోనాపై యుద్దం చేస్తోన్న వైద్యులు, పోలీసుల గొప్పదనం వారికి తెలుసు. అందుకే ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు నివాళిగా ఈ ఈవెంట్‌లో ఓ పర్ఫామెన్స్ చేశారు. నవ్యస్వామి డాక్టర్‌గా, రవికృష్ణ పోలీస్‌గా నటించారు. అనంతరం రవికృష్ణ తన సొంత అనుభవాలను చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తనకు కరోనా నెగెటివ్ వస్తే కూడా ఇంట్లోకి రానివ్వలేదు.. చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదు.. చెల్లి చెల్లి అంటాను కదా నాకు అమ్మతో సమానం అంటూ శివజ్యోతిని పట్టుకుని రవికృష్ణ ఏడ్చేశాడు.