హీరోలకు అభిమానులకు మధ్య ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మన తెలుగు అభిమానుల విషయానికి వస్తే అది వేరే లెవెల్‌లో ఉంటుంది. తమ అభిమాన హీరో జోలికి ఎవరైనా వస్తే దుమ్ములేపుతారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ ఏకమై ట్వీట్లతో దాడి చేస్తుంటారు. అయితే హీరోలపై కామెంట్స్ చేశారని వార్తలు వస్తే అవి నిజమా? అబద్దమా? అని క్షణం కూడా ఆలోచించరు.
హీరోను కించపరిచేలా మాట్లాడిన వారిని ట్రోల్ చేసి పడేస్తారు. అలాంటి ఓ ఘటనే చలాకీ చంటికి వచ్చింది. 2014 సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల నిద్రలేకుండా పోయిందట. తాను ప్రభాస్‌ను ఏదో అన్నానని పోస్ట్ పెట్టినట్టు తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకపడ్డారట. తాజాగా ఆ ఘటన వెనుకున్న అసలు సంగతులు చంటీ తాజాగా బయటపెట్టాడు.
ప్రభాస్‌ను ఏదో అన్నానంటూ 2014లో సోషల్‌మీడియా వేదికగా తన గురించి పుకార్లు వచ్చాయని చంటి తెలిపాడు. అది ఎంతవరకూ నిజం అని ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. దాంతో వారం రోజులపాటు చుక్కలు చూపించేశారని పేర్కొన్నాడు. ఫేస్‌బుక్ అంతా గాలించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని కనిపెట్టి.. పోలీసుల సాయంతో అతడ్ని పట్టుకున్నానని అసలు సంగతి చెప్పాడు. ‘నా గురించి అసత్య ప్రచారం ఎందుకు చేశావు? నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా?’ అని తాను ప్రశ్నిస్తే.. ‘నా స్నేహితులు చెప్పారు. అందుకే పోస్ట్ పెట్టా’ అని నిర్లక్ష్యంగా బదులిచ్చాడట. కానీ ఆ వారం రోజులపాటు జరిగిన ఎటాక్ వల్ల ఫోన్ నంబర్ మార్చుకున్నానని దాంతో ఓ సినిమా ఆఫర్ కూడా పోయిందని నాటి సంగతులు చెప్పాడు.