మోహన్ బాబు నన్ను నా స్దలంలోకి రానివ్వటం లేదు

చెక్కుబౌన్స్ కేసులో ఏడాది శిక్షతో పాటు భారీ జరిమానాతో రీసెంట్ గా వార్తలకు ఎక్కిన మోహన్‌బాబుకి మరో షాక్ ఇచ్చారు దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి. ‘సలీం’ చిత్ర వివాదాన్ని మరింత రాజేస్తూ లీగల్ నోటీసులు పంపిస్తూ మీడియాకి లేఖను విడుదల చేశారు వైవీఎస్ చౌదరి.

మీడియా మిత్రులందరికీ నమస్కారం…

వై.వి.ఎస్‌. చౌదరి అను నేను శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై శ్రీ యం. మోహన్‌బాబు నిర్మించిన, ‘సలీమ్‌’ (2009) చలన చిత్రం యొక్క దర్శకత్వపు బాధ్యతలను నిర్వర్తించినందుకుగాను, రెమ్యూనరేషన్‌ నిమిత్తం శ్రీ యం. మోహన్‌బాబు నాకు బాకీ పడ్డ రూ. 40,50,000 చెక్‌ విషయమై, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దాదాపు 9 సంవత్సరాల అనంతరం ’23వ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు’ ఎర్రమంజిల్‌, హైదరాబాద్‌లో 2 ఏప్రిల్‌ 2019న నాకు అనుకూలంగా తీర్పు వచ్చిన అందిరకీ తెల్సినదే.

ఈ నేపథ్యంలో శ్రీ యం. మోహన్‌బాబు నేను సదరు న్యాయసానాన్ని తప్పుదోవ పట్టించినట్లుగా ఇటీవల పత్రికా ప్రకటన విడుదల చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

అంతేకాకుండా ‘సలీమ్‌’ చిత్ర నిర్మాణ సమయంలో ఇప్పుడు శ్రీ యం. మోహన్‌బాబు హైదరాబాద్‌ జల్‌పల్లి గ్రామంలో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని, నా ఇంటి నిర్మాణానికై నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి, చెక్‌ బౌన్స్‌ కేసు కోర్టు తీర్పు అనంతరం నన్ను, నా మనుషుల్ని రానీకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది.

నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం న్యాయనిపుణులను ఆశ్రయించడమైనది. పూర్తి వివరాలకై మా న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్‌ నోటీసును ఈ లేఖతో జతచేయడమైనది, గమనించగలరు.
ఎల్లప్పుడూ మీ సహాయసహకారాలను కాంక్షించే
మీ
వై.వి.ఎస్‌. చౌదరి
సినీ దర్శక-నిర్మాత

ఈ విషయంపై మోహన్ బాబు ఏమంటారంటే….2009లో `స‌లీమ్` సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశాం. మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికి వైవిఎస్ చౌదరికి రూ.40ల‌క్ష‌ల చెక్ ఇచ్చాం.

అయితే సలీమ్ చిత్రం అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో..వైవిఎస్ చౌద‌రితో చేయాల్సిన తర్వాతి సినిమాను వ‌ద్ద‌నుకున్నామన్నారు. సినిమా చేయ‌డం లేద‌ని వైవిఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని కూడా ఆయనకు చెప్పామన్నారు.

చెక్ ను బ్యాంక్ లో వేయొద్దని చెప్పినా కూడా కావాల‌నే వైవిఎస్ చౌదరి చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ బౌన్స్ చేశారని మోహన్ బాబు ఆరోపించారు. నాపై చెక్ బౌన్స్‌ కేసు వేసి కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. దీంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని మేము సెష‌న్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నామని, కొన్ని చానెల్స్‌లో తనపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దని మోహన్ బాబు కోరారు.