గీతా ఆర్ట్స్ లో పేపర్ బోయ్ డైరెక్టర్?
పరిశ్రమ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ గురించి పరిచయం అవసరం లేదు. అల్లు అరవింద్ సారథ్యంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని నిర్మించింది. ఇదే సంస్థకు అనుబంధ సంస్థగా గీతా ఆర్ట్స్ 2 (జీఏ2) బ్యానర్ వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్ని నిర్మిస్తోంది. ఈ బ్యానర్ లో ఇప్పటికే 100 పర్సంట్ లవ్.. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. ఇక ఈ బ్యానర్ లో ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో `ప్రతి రోజు పండగే` తెరకెక్కుతోంది. దీంతో పాటే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వేరొక సినిమాని గీతా ఆర్ట్స్ 2 సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
వీటితో పాటే ఈ బ్యానర్ లో వేరొక సినిమా కూడా కన్ఫామ్ అయ్యిందని తెలుస్తోంది. యంగ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీవిష్ణుతో పేపర్ బోయ్ ఫేం జయశంకర్ దర్శకత్వంలో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ లో ఛాన్స్ అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. శ్రీవిష్ణు.. జయశంకర్ ఇద్దరికీ ఇదో సదవకాశం. బ్రోచేవారెవరురా లాంటి క్లాసిక్ హిట్ తర్వాత శ్రీవిష్ణుకి ఇది పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీఏ2 సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.