తెలుగు సినీ పరిశ్రమకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెబుతారా.?

తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు, త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానం నేపథ్యంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఏయే అంశాలపై చర్చించాలన్నదానిపై మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ప్రధానంగా కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అంశం గురించిన చర్చ జరిగిందనీ, థియేటర్లలో కొత్త సినిమాలకు టిక్కెట్ల ధరల్ని తాత్కాలికంగా పెంచుకునే వెసులుబాటు కల్పించడం, థియేటర్లకు విద్యుత్ ఛార్జీలపై రాయితీలు.. ఇలా పలు అంశాల గురించి వైఎస్ జగన్‌తో చర్చించాలని సినీ ప్రముఖులంతా ఓ నిర్ణయానికి వచ్చారట.

ఎవరెవరు వైఎస్ జగన్ వద్దకు వెళితే బావుంటుందన్నదానిపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి, నాగార్జున సహా పలువురు సినీ ప్రముఖులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ‘సినీ పరిశ్రమ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే..’ అని అప్పట్లో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ, ‘వకీల్ సాబ్’ సినిమా విషయానికొచ్చేసరికి, సినిమా టిక్కెట్ల ధరల్ని తగ్గించేయడం రాజకీయంగా పెను వివాదానికి కారణమయ్యింది. ఆ దెబ్బతో ఇప్పుడు పెద్ద సినిమాల రిలీజులంటేనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా వుంటే, పరిశ్రమ సమస్యలపై వైఎస్ జగన్ ఓ అవగాహనతో వున్నారనీ, టిక్కెట్ల ధరల విషయమై సానుకూల నిర్ణయమే ప్రభుత్వం నుంచి రాబోతోందనీ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో లేని ఇబ్బంది, ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు.? అన్న దిశగా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. అదే జరిగితే, అంతకన్నా గుడ్ న్యూస్ సినీ పరిశ్రమకు ఇంకేముంటుంది.?