బయోపిక్ టాక్: ఎవరీ జార్జిరెడ్డి ఎవరు? ఎందుకంత ఫేమస్?
టాలీవుడ్ లో వరుస బయోపిక్ హంగామా మామూలుగా లేదు. మహానటి సావిత్రి బయోపిక్.. విశ్వవిఖ్యాత నవరస నటసార్వభౌముడు ఎన్టీఆర్ బయోపిక్ తరువాత మరో బయోపిక్ పైనా తెలుగు సినీపరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా రిలీజైన జార్జిరెడ్డి బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ పరిశ్రమలో కొత్త చర్చకు తెరలేపింది. అసలు ఎవరీ జార్జిరెడ్డి? అంటూ ఆసక్తిగా ఆరాలు మొదలయ్యాయి.
జార్జిరెడ్డి ఉస్మానియా విద్యార్థి. అతడి నేపథ్యం ఎంతో ఆసక్తికరం. ఇక ఈ బయోపిక్ కి `దళం` చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వర్మ శిష్యుడు జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆరేళ్ల విరామం తరువాత జీవన్‌రెడ్డి ఈ కథనే ఎందుకు ఎంచుకున్నాడు? అసలు జార్జిరెడ్డి ఎవరు?. అతని వెనకున్న కథేంటి? సినిమా తీయాల్సినంత కథ జార్జిరెడ్డి వెనక వుందా? అంటే చాలానే తెలుసుకోవాల్సి ఉంటుంది.
జార్జిరెడ్డి పుట్టింది కేరళాలోని పాల్ఘాట్ లో. కానీ పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. దుందుడుకు స్వభావం, అభ్యుదయ భావాలు, కళ్లముందు అన్యాయం జరుగుతుంటే చూస్తే ఊరుకోలేని తత్వం జార్జిరెడ్డి సొంతం. అవే అతన్ని వామపక్ష భావాజాలం వైపు నడిపించి కాలేజీ దశలోనే రెబల్‌గా మార్చాయి. ఒక లీడర్ ని చేశాయి. 60వ దశకంలో ఉస్మానియా క్యాంపస్‌లో విప్లవ శంఖారావాన్ని పూరించిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. బాక్సింగ్ ఛాంపియన్‌గా గోల్డ్‌మెడల్‌ని సొంతం చేసుకున్న జార్జిరెడ్డి విప్లవమే ఊపిరిగా సమసమాజ స్థాపన ధ్యేయంగా అడుగులు వేశాడు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో మార్పునకు కారణమయ్యాడు. 25 ఏళ్ల వయసులోనే తన ఆయువునే ధారపోశాడు. క్యాంపస్‌లో రాజకీయ ఆదిపత్య గొడవలు ఏ స్థాయికి చేరాయో ప్రపంచానికి చాటిచెప్పాడు.
జార్జిరెడ్డి విద్యార్థి లోకానికి వేగుచుక్క. ఓ రోల్ మోడల్. పీడీఎస్‌యూ(ప్రోగ్రెసీవ్ డెమొక్రెటివ్ స్టూడెంట్స్ యూనియన్)ని స్థాపించి యూనివర్సీటీ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీశారు. దశాబ్దాల కిందట హీరోగా నిలిచిన జార్జిరెడ్డి ఉస్మానియా క్యాంపస్‌లోనే హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అతడి లైఫ్‌లో నక్సలిజం అనే కోణం ఎంతో ఆసక్తికరం. అలాంటి వ్యక్తి జీవితాన్ని నేటి తరానికి చూపించాలనే పట్టుదలతో దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని చాలా వ్యయ ప్రయాసకోర్చి తెరపైకి తీసుకొస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. `ఏ బయోపిక్ ఆఫ్ ద ఫర్గాటెన్ లీడర్` అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాండీ అలియాస్ సందీప్ ఇందులో జార్జిరెడ్డిగా నటించాడు. ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం విడుదల చేయగానే అసలింతకీ ఎవరీ జార్జిరెడ్డి అన్న ముచ్చటా వేడెక్కించింది. ప్రస్తుతం ప్రతి చోటా ఈ బయోపిక్ గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది.