కరోనా కల్లోలం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల లాక్ డౌన్ సమస్యాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినీపరిశ్రమపై బిగ్ పంచ్ పడిందని విశ్లేషిస్తున్నారు. ఇరుగు పొరుగు పరిశ్రమలపైనా ప్రభావం తీవ్రంగానే ఉంది. షూటింగులు బంద్.. థియేటర్ల బంద్ వ్యవహారం లక్షలాది మంది ఉపాధిని దెబ్బ కొట్టింఇ.
దేశంలో వినోద పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయి ఇప్పటికే దాదాపు 50 రోజులు పూర్తయింది. షూటింగులకు అనుమతులు లేకపోయినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తమిళనాడు- కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. దీంతో ఆయా పరిశ్రమల్లో ఇప్పుడు ముఖాల్లో నవ్వు కనిపిస్తోంది. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లోనే ఉండి పనులు చేయాలని చెప్పడం సహా రకరకాల ఆంక్షలు విధించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల చివరి దశలో ఉన్న చిత్రాలకు ఇది పెద్ద ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.
అయితే.. టాలీవుడ్ కి రిలీఫ్ ఎప్పుడు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లాక్ డౌన్ నుంచి తెలుగు సినీ పరిశ్రమకు విరామం ఇస్తుంది? అన్నదానిపై సరైన స్పష్టత లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే మార్గాన్ని అనుసరిస్తాయని .. కొన్ని పరిమితులతో సడలింపులు ఇస్తాయని నిర్మాతలు, పరిశ్రమ నిపుణులు ఆశిస్తున్నారు. ల్యాబుల్లో పోస్ట్ ప్రొడక్షన్ కి అనుమతులు ఇస్తారా లేదా? షూటింగులు ప్రారంభించుకోవడం.. థియేటర్లు తెరవడంపై ఎలాంటి మార్గదర్శకాలు ఉండనున్నాయో చూడాలి.
