రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపికా పదుకొణెని చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దీపికకు తొలి టాలీవుడ్ డెబ్యూ మూవీ ఇదే అవుతుంది. ఇప్పటివరకూ చాలా మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఇప్పుడిలా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం..దర్శకుడు నాగ్ అశ్విన్ వినిపించి స్ర్కిప్ట్ నచ్చడంతో దీపిక గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అయితే అమ్మడు ఇప్పుడు ఈ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుంది అన్నది టాలీవుడ్ సహా ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో దీపిక ప్రకటన రాగానే అమ్మడు ఎంత ఛార్జ్ చేస్తుందంటూ ఇంటా బయట హాట్ టాపిక్ గా నలుగుతోంది.
బాలీవుడ్ లోనే భారీగా ఛార్జ్ చేసే అమ్మడిని తొలి టాలీవుడ్ సినిమాకు ఎన్ని కోట్లు ఇచ్చి లాక్ చేసారు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ వర్గాల నుంచి ఆసక్తికర సంగతే లీకైంది. ఈ సినిమాకు గాను దీపికకు అక్షరాలా! ఎనిమిది కోట్ల నుంచి 10 కోట్ల మధ్య లో ఇస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఎనిమిదికోట్లకు తక్కువ కాకుండానే నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగినట్లు సమాచారం. అలాగే దీపికను ఈ సినిమాకు ఏరి కోరి మరీ ఎంపిక చేసారుట. బాలీవుడ్ లో చాలా మంది భామల పేర్లు పరిశీలించి చికవరికి పారితోషికం ఎక్కువైనా ఆ పాత్రకు దీపిక అయితే న్యాయం చేయగలదని భావించి దర్శకుడు పట్టుబట్టి మరీ ఎంపిక చేసారుట.
ఈ విషయంలో చిత్ర నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ కూడా అంత పారితోషికం అవసరమా? అని తన సీనియర్టీ తెలివి తేటలు వాడినప్పటికీ నాగ్ అశ్విన్ ససేమేరా అన్నాడుట. దీపిక ఎంపిక విషయంలో నాగ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడుట. ముంబై బాలీవుడ్ ఎజెన్సీలతో మాట్లాడటం..దీపిక అపాయింట్ మెంట్ సంపాదించడం స్ర్కిప్ట్ వినిపించడం సహా అన్ని పనులు నాగ్ అశ్విన్ చూసుకున్నాడుట. మొత్తానికి ఎలాగూ దీపిక డేట్లు అయితే పట్టేసారు. ఇక పారితోషికం పరంగా ఇప్పటివరకూ అధిక పారితోషికం హీరోయిన్లలలో ఇద్దరు ఉన్నారు. ఒకరు ప్రియాంక చోప్రా అప్పట్లో రామ్ చరణ్ సరసన నటించిన తుఫాన్ సినిమా కోసం 5 కోట్లు ఛార్జ్ చేసింది. ఆ తర్వాత స్వీటీ అనుష్క బాహుబలి రెండు భాగాలకు కలిపి 7 కోట్లు కు పైగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు వాళ్లిద్దర్నీ దీపిక బీట్ చేసింది.