‘ఎన్టీఆర్ బయోపిక్’ : విద్యాబాలన్ కి బై చెప్పేసారు

స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో నట, రాజ‌కీయ జీవితం హైలెట్ చేస్తూ ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతాకరం పాత్రలో హిందీ నటి విద్యా బాలన్‌ కనిపించనున్నారు. గురువారంతో ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగిసింది. ఆమె టీమ్ అంతా బై చెప్పింది. ఆమె ముంబై వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ఇచ్చింది.

లైవ్ లో విద్యా బాలన్‌ మాట్లాడుతూ ‘‘హాయ్‌… తెలుగులో నా తొలి సినిమా ‘యన్‌.టి.ఆర్‌’. ఇందులో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశా. నందమూరి బాలకృష్ణగారితో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటించింది. సినిమాలో వాళ్లందర్నీ చూడటం ప్రేక్షకులకు మధురానుభూతి. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతోంది. తొలి భాగం జనవరి 9న ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అన్నారు.

అలాగే హైదరాబాద్‌ సిటీతో ఆమెకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ ‘‘సిటీలో నేను షూటింగ్‌ చేసిన మూడో సినిమా ‘యన్‌.టి.ఆర్‌’. ‘డర్టీ పిక్చర్‌’లో 60 నుంచి 70 శాతం ఇక్కడే చిత్రీకరించాం. ‘బాబీ జాసూస్‌’ అయితే 80 నుంచి 90 శాతం హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశాం. ఆ సినిమా కోసం ఛార్మినార్‌, కాచిగూడ, నాంపల్లి, ఓల్డ్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తిరిగా.

Vidyabalan Photo: IANS)

శంషాబాద్‌లోని ఒక పురాతన హవేలీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. నేను ప్రతిసారీ ఎయిన్‌పోర్ట్‌ నుంచి సిటీకి వెళ్లేటప్పుడు ఆ హవేలీ గుర్తొస్తుంది. ఇక, ‘యన్‌.టి.ఆర్‌’ సినిమాలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ వంద శాతం హైదరాబాద్‌లో చేశాం’’ అన్నారు.

యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. వచ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రెండు పార్ట్‌లుగా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ప‌లు పాత్ర‌ల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ వారి వారి పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తున్న ‘యన్‌.టి.ఆర్‌’ తొలి భాగం ‘యన్‌.టి.ఆర్‌ – కథానాయకుడు’ జనవరి 9న, రెండో భాగం ‘యన్‌.టి.ఆర్‌ – మహానాయకుడు’ జనవరి 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.